మార్చి 5వ తేదీ సమీపిస్తోంది. ఈలోగా ఆంధ్రా విషయంలో కేంద్రం ఏదో ఒకటి ప్రకటిస్తుందన్న ఆశ సన్నగిల్లుతోంది. యథావిధిగా ఆ రోజు నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలౌతాయి. ఇప్పుడు భాజపా దృష్టంతా కర్ణాటక ఎన్నికలపైనే ఉన్నట్టుగా ఉంది. ఈ నేపథ్యంలో ఆంధ్రా నుంచి కొందరు భాజపా నేతలు ఢిల్లీకి వెళ్లారు. అమిత్ షాకి ఒక నివేదిక ఇచ్చినట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితి, టీడీపీతో పొత్తు వ్యవహారానికి సంబంధించి మంత్రి మాణిక్యాలరావు ఢిల్లీ పెద్దలతో మాట్లాడినట్టు తెలుస్తోంది! ఇందులో రాష్ట్ర అవసరాల ప్రస్థావన లేదనే తెలుస్తోంది. టీడీపీతో పొత్తు ఉంచుకోవాలా..? మార్చి 5 తరువాత తెంచుకోవాలన్నదే ప్రధానాంశంగా ఉన్నట్టు సమాచారం.
ఆంధ్రాలో భాజపా బలపడుతోందనీ, గతంతో పోల్చుకుంటే ఓటు బ్యాంకు కూడా పెరిగిందని అమిత్ షాకి నివేదిక అందినట్టు సమాచారం. ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా పెద్ద సంఖ్యలో సభ్యత నమోదు జరిగిందని గుర్తు చేశారట. అంతేకాదు, వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీ తమపై ఆధారపడే అవకాశాలే ఎక్కువ ఉన్నట్టు తెలిపారట. ఇంకోపక్క, వైకాపా గురించి ప్రస్థావిస్తూ వారూ బాగానే బలపడుతున్నారనే అభిప్రాయాన్ని అమిత్ షాకి చేరవేశారట..! త్వరలోనే రాష్ట్ర భాజపా నేతలు మరో నివేదిక ఇవ్వనున్నట్టుగా తెలుస్తోంది. తాజా రాజకీయ పరిస్థితులపై ఢిల్లీలో కొంతమంది కీలక భాజపా నేతల మధ్య చర్చలు జరిగాయనీ, టీడీపీతో పొత్తు అంశమా ప్రధాన అజెండాగా చర్చిస్తున్నట్టు సమాచారం.
ఏపీ భాజపా నేతలు పార్టీకి మాత్రమే విధేయత చూపిస్తున్నారు, మంచిదే. కానీ, ఈ క్రమంలో రాష్ట్ర అవసరాల గురించి, వారు కూడా ఈ రాష్ట్ర ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నామన్న విషయం మరచిపోతున్నారు. టీడీపీతో పొత్తు కొనసాగించాలా వద్దా అనే అంశానికే ప్రాధాన్యత ఇస్తున్నారే తప్ప, కేంద్రం ఇచ్చిన హామీలేంటీ ఎందుకు అమలు చేయడం లేదూ, అదనపు కేటాయింపులు ఎలా దక్కించుకోవాలన్న ప్రయత్నమే ఏపీ భాజపా నేతల నుంచి లేకపోవడం శోచనీయం. టీడీపీతో పొత్తు తెంచుకునేందుకు ఏపీ భాజపా అన్ని రకాలుగా సిద్ధమౌతోందని అర్థమౌతోంది. ఇంకోపక్క, వైకాపా గురించి ఆరా తీయడం ద్వారా వారి భవిష్యత్ ప్రణాళిక ఏంటనేది కూడా స్పష్టమౌతోంది. ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే మార్చి 5 లోపు గణనీయంగా ఏమార్పులూ ఉండవు అనిపిస్తోంది. ఢిల్లీ వేదికగా మళ్లీ టీడీపీ ఉద్యమించాల్సిన పరిస్థితే కనిపిస్తోంది.