ఏపీలో కాంగ్రెస్ పార్టీతో టీడీపీ పొత్తు ఉంటుందో లేదో స్పష్టత లేదుగానీ… ఆ నేపథ్యంలో రాజకీయంగా ఏపీతోపాటు ఇప్పుడు తెలంగాణలో కూడా చర్చ జరుగుతూ ఉండటం విశేషం! రెండ్రోజుల కిందటే… టీడీపీతో పొత్తు పెట్టుకోవద్దంటూ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి… భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్ సూచించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటే తప్పేంటని జేసీ దివాకర్ రెడ్డి అభిప్రాయపడ్డ సంగతీ తెలిసిందే. టి. కాంగ్రెస్ ఈ పొత్తు గురించి పెద్దగా చర్చ జరుగుతున్న వాతావరణం లేదుగానీ, తెలంగాణ టీడీపీ వర్గాల్లోనే ఈ చర్చ కొంత పెరుగుతోందని తెలుస్తోంది..! కాంగ్రెస్ తో పొత్తు ఉంటుందా, ఉండదా అనే స్పష్టత వస్తే… కొంతమంది టీ టీడీపీ నేతల రాజకీయ భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయాలపై కూడా స్పష్టత వస్తుందట..!
తెలంగాణ తెలుగుదేశంలో చెప్పుకోదగ్గ నాయకులు ఎవరంటే… చేతి వేళ్ల లెక్కించొచ్చు. మహబూబ్ నగర్ జిల్లాతోపాటు, కొన్ని నియోజక వర్గాల్లో టీడీపీకి క్షేత్రస్థాయిలో ఇప్పటికీ కొంత బలమైన కేడర్ ఉన్న మాట వాస్తవమే. కొంతమంది నాయకులూ ఉన్నమాటా వాస్తవం. అయితే, ఇలాంటి చోట్ల ఈ మధ్య కాంగ్రెస్ కూడా కొంత ఫోకస్ పెట్టిందని సమాచారం. టీ టీడీపీలో కొంతమంది నేతల్ని ఆహ్వానించే ప్రయత్నంలో ఉన్నారనీ, ఇప్పటికే కొంతమందికి టచ్ లోకి ఆ పార్టీ నేతలు వెళ్లినట్టుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి. టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించే ప్రయత్నం ఇదివరకే జరిగింది. దయాకర్ రెడ్డి, సీతా దయాకర్ రెడ్డిలు కాంగ్రెస్ తో పొత్తు కుదిరితే… టీడీపీ తరఫున బరిలోకి దిగినా గెలుపు సులువు అవుతుందనే అంచనాలో ఉన్నట్టు సమాచారం. ఈసారి ఎలాగూ టీడీపీ నుంచి కొన్ని కొత్త ముఖాలే తెలంగాణ ఎన్నికల బరిలోకి వచ్చే అవకాశాలున్నాయి. ద్వితీయ శ్రేణి నాయకులను ప్రోత్సహించి… టిక్కెట్లు ఇచ్చే ఆలోచన పార్టీకి ఉందనే అభిప్రాయం ఉంది.
అయితే, కాంగ్రెస్ తో పొత్తు లేదనే స్పష్టత వచ్చేస్తే… ప్రస్తుతం టీడీపీలో ఉన్న కొంతమంది నేతలు కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారనే చర్చా జరుగుతోంది. ఓ ఇద్దరు ప్రముఖ టీడీపీ నేతల్ని టి. కాంగ్రెస్ సంప్రదిస్తే… వారు కూడా ఇదే అభిప్రాయం చెప్పారనీ, మీతో పొత్తు కుదిరితే ఏ ఇబ్బందీ లేదనీ, ఒకవేళ పార్టీ అధినాయకత్వం దానికి కాదంటే… కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నామనే అభిప్రాయంతో ఆ నేతలు ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మొత్తానికి, కాంగ్రెస్ తో టీడీపీ పొత్తు చర్చతో ఇలాంటి పరిణామాలు కూడా ముడిపడి ఉన్నాయన్నమాట!