ఏడాదిన్నరలో జమిలీ ఎన్నికలు వస్తాయని తెలుగుదేశం పార్టీ నేతలు బలంగా విశ్వసిస్తున్నారు. దానికి సంబంధించి వారి వద్ద స్పష్టమైన సమాచారం ఉందో లేదో స్పష్టత లేదు కానీ.. తాము ఎదుర్కొంటున్న వేధింపుల విషయంలో మాత్రం.. కంట్రోల్ తప్పి పోతున్నారు. జేసీ దివాకర్ రెడ్డి లాంటి నేతలు.. తాము అధికారంలోకి వస్తే.. ఏ ఒక్కర్నీ వదిలి పెట్టబోమని హెచ్చరిస్తూ ఉంటారు. చివరికి ప్రత్తిపాటి పుల్లారావు కూడా అదే అంటున్నారు. చాలా మంది టీడీపీ నేతలు అదే చెబుతున్నారు కానీ.. కొంత మంది నేతలు మాత్రం.. టాపిక్‌ను చంద్రబాబు వద్దకు తీసుకెళ్తున్నారు. చంద్రబాబు కక్ష సాధింపు చర్యలకు దూరం కాబట్టి.. అధికారం అందినా.. తమను కంట్రోల్ చేయాలనుకుంటారని… వారు భావిస్తున్నారు. అందుకే… చంద్రబాబు అలాగే ఉంటే.. ఏ ఒక్క టీడీపీ నేత కూడా ఆయన మాట వినరని అంటున్నారు.
మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అదే విషయాన్ని నేరుగా చెప్పారు. కలెక్టర్, ఎస్పీ లు కూడా ఎందుకు దిగజారి ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదని.. ఏ అధికారిని వదలం ….అందరిని గుర్తుంచుకుంటామని హెచ్చరించారు. చంద్రబాబు పాత పద్దతి లోనే ఉంటే ఆయన మాట ఏ ఒక్క ఎమ్మెల్యే వినే పరిస్థితి ఉండదంటున్నారు. దెబ్బకు దెబ్బ తీసే విదంగా చంద్రబాబు మారాలి, మారకపోతే ఆయన ఒక్కరే మిగిలిపోతారని హెచ్చరికలు జారీ చేశారు. టిడిపి అంటే ఏంటో చూపిస్తాం…ప్రతి కార్యకర్త ను కాపాడుకుంటామని సవాల్ చేస్తున్నారు. అధికారంలోకి రావడం.. ప్రతీకారం తీర్చుకోవడం ఖాయమని ఆయన అంటున్నారు.
గతంలో జేసీ దివాకర్ రెడ్డి కూడా అదే అన్నారు. తాము ప్రతీకారం తీర్చుకోవడానికి చంద్రబాబు అంగీకరించకపోతే.. ఉరితాళ్లు తీసుకెళ్లి ఆయన ముందు నిల్చుంటామని.. చావమంటారా అని అడగడం తప్ప..ఇంకేమీ చేయలేమని ఆయనన్నారు. రాజకీయ కక్ష సాధింపులు.. ఏ రేంజ్లో ఉంటున్నాయో.. టీడీపీ నేతల స్పందనతోనే తెలిసిపోతోంది. అయితే.. వారందరికీ చంద్రబాబుపైనే అనుమానం. అధికారంలో ఉండగా.. ఎలాంటి కక్ష సాధింపులకు పాల్పడిన దాఖలాలు లేవు. ప్రస్తుత ప్రభుత్వం కక్ష సాధింపుగా చేస్తున్న పనుల్లో పది శాతం చేసినా వైసీపీ నేతల వ్యాపారాలన్నీ ఎప్పుడో కుప్పకూలిపోయి ఉండేవి. అందుకే టీడీపీ నేతల్లో ఆగ్రహం రగిలిపోతోంది. అధికారం అందిన తర్వాత తాము అంతకు మించి చేయాలన్న కసితో ఉన్నారు. చంద్రబాబు ఎక్కడ అడ్డుకుంటారోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే చంద్రబాబు కూడా.. చాలా సార్లు తాము అన్నీ రాసి పెట్టుకుంటున్నామని ఎవర్నీ వదిలి పెట్టబోమన్న ప్రకటనలు ఇచ్చారు. కానీ పార్టీ నేతలు నమ్మలేకపోతున్నారు.