స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి, వామపక్షాల మధ్య పొత్తు పొడిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబుతో సీపీఐ నేతలు కె.రామకృష్ణ, నేతలు ముప్పాళ్ల నాగేశ్వరరావు, హరనాథరెడ్డి భేటీ అయ్యారు. కలిసి పోటీచేసే అంశంపై వారి మధ్య కొంత చర్చ జరిగింది. ఈ నెల 8న ఉభయ కమ్యూనిస్టు పార్టీల సమావేశం జరుగుతుందని … రెండు పార్టీలు ఒకే వైఖరితో వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయని .. ఆ సమావేశం తర్వాత మరోసారి కలుస్తామని సీపీఐ నేతలు చెప్పినట్లు తెలుస్తోంది. సీపీఐ పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతోంది. ప్రజా పోరాటాలు చేస్తోంది. అయితే.. సీపీఎం మాత్రం అంత యాక్టివ్‌గా లేదు. పైగా.. సీపీఎం నేత మధు జగన్‌పై కాస్త పాజిటివ్‌గా స్పందిస్తున్నారు.
గత ఎన్నికల్లో జనసేనతో పొత్తు పెట్టుకున్న లెఫ్ట్ పార్టీలు… కనీస ఫలితాన్ని సాధించలేకపోయారు. ఓటు బ్యాంకును అంతకంతకూ కోల్పోతున్నారు. దీంతో.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కనీస మాత్రం అయినా… తమకు బలం ఉన్న చోట్ల అయినా… కొంత ప్రాతినిధ్యం దక్కించుకుంటే ఉనికి నిలబడుతుందని నమ్ముతున్నారు. జనసేన పార్టీ.. బీజేపీతో టచ్‌లోకి వెళ్లిపోయింది. ఆ పార్టీతో కలిసి పని చేసేందుకు సిద్దయింది. స్థానిక ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తామని ఆ పార్టీలు ప్రకటించాయి.
ఇప్పుడు లెఫ్ట్ పార్టీలకు మరో ఆప్షన్ లేకుండా పోయింది.. అయితే ఒంటరిగా పోటీ చేయాలి. లేకపోతే.. టీడీపీతో కలిసి పోటీ చేయాలి. ఒంటరిగా పోటీ చేస్తే… పట్టించుకునేవారు ఉండరు. కనీసం..,. బలం ఉన్న చోట్ల.. ప్రాతినిధ్యం కోసం అయినా… టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బెటర్ అని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే.. స్థానిక ఎన్నికలు ముంచుకొచ్చేశాయి. ఇప్పుడు.. అంత తేలిగ్గా.. ఈ పొత్తు వ్యవహారం తేలే అవకాశం లేదన్న అభిప్రాయం టీడీపీలో ఉంది.