ప్రస్తుతం ఏ న్యూస్ ఛానల్లో చూసినా గోదావరి పరవళ్ళు, దాని ఉద్రుతికి లంక గ్రామాల ముంపుకి గురవుతున్న వార్తలే కనిపిస్తున్నాయి. గోదావరి నీళ్ళని కృష్ణా డెల్టా, రాయలసీమ జిల్లాలకి తరలించేందుకు తెదేపా ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా పట్టిసీమ ప్రాజెక్టుని నిర్మించింది. గోదావరి ఉదృతంగా ప్రవహిస్తున్నప్పుడే పట్టిసీమకి పని ఉంటుంది. ప్రస్తుతం అది చాలా ఉదృతంగా ప్రవహిస్తోంది కనుక మీడియా ద్వారా పట్టిసీమ ప్రాజెక్టుని ప్రజలకి చూపించి, దాని ప్రయోజనాల గురించి గట్టిగా చెప్పుకొనే అవకాశాన్ని తెదేపా నేతలు, అధికారులు చేజేతులా వదులుకొంటున్నారు.
అదొక వృధా ప్రాజెక్టు అని వైకాపా నేతలు గట్టిగా వాదిస్తున్నారు. వారి వాదన తప్పని నిరూపించి చూపే మంచి అవకాశాన్ని వదులుకోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సమయంలో పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా కృష్ణాడెల్టా, రాయలసీమకి ఎన్ని నీళ్ళు పారించగలిగారు? ఎన్ని ఎకరాలలో పంటలకి నీళ్ళు అందించగలిగారు? కృష్ణానదిలో నీటి పరిస్థితి ఏమిటి? గోదావరి నుంచి పట్టిసీమ ద్వారా కృష్ణాకి నీళ్ళు రాకపోయుంటే పరిస్థితి ఏమిటి? అనే వివరాలని గట్టిగా చాటిచెప్పుకొనే అవకాశాన్ని తెదేపా నేతలు వదులుకోవవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తోంది. తెదేపా అనుకూల మీడియా కూడా పట్టిసీమ ప్రాజెక్టు ద్వారా ప్రస్తుతం ఎన్ని నీళ్ళు కృష్ణానదిలోకి పంపింగ్ అవుతున్నాయి? అసలు పట్టిసీమ ప్రాజెక్టు విజయవంతం అయ్యిందా లేదా? అనే విషయంపై చర్చించడానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పట్టిసీమ ప్రస్తుత పరిస్థితి ఏమిటో ప్రజలకి చెప్పేవారు లేకుండాపోయారు.
ప్రతీ చిన్న విషయాన్నీ గొప్పగా చాటింపు వేసుకొనే తెదేపా నేతలు ఇటువంటి మంచి అవకాశాన్ని ఎందుకు వదులుకొంటున్నారో? వారి మౌనం చూస్తుంటే పట్టిసీమ మోటర్లు, పైప్ లైన్స్ లో మళ్ళీ ఏమైనా కొత్త సమస్యలు తలెత్తాయా? అనే అనుమానం కలుగుతోంది.