మే 27 నుండి 29 వరకు తిరుపతిలో మహానాడు సమావేశాలు జరుగబోతున్నాయి. అందులో తెదేపా-భాజపాల మద్య చిచ్చు రగులుస్తున్న ప్రత్యేక హోదాపై కూడా ఒక తీర్మానం ఆమోదించబోతున్నట్లు ఒక తెదేపా నేత మీడియాకి తెలిపారు. కానీ భాజపాతో తమ పార్టీ సంబంధాల గురించి ఆ సమావేశాలలో చర్చించబోవడం లేదని తెలిపారు.
ఒకప్పుడు భాజపా నేతలు, కేంద్ర మంత్రులు కూడా రాష్ట్రంలో ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియాకి భయపడి ప్రత్యేక హోదాపై రకరకాలుగా మాట్లాడేవారు. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదా ఇవ్వమని చాలా స్పష్టంగానే చెపుతున్నారు. తెదేపా మాత్రం నేటికీ దాని గురించి రకరకాలుగా మాట్లాడుతూనే ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిల్లీ వెళ్ళక ముందు దాని గురించి ఒకలాగా, వెళ్లి వచ్చిన తరువాత మరొకలాగ మాట్లాడటం గమనిస్తే అది అర్ధమవుతుంది. ప్రత్యేక హోదా గురించి ప్రధానిని గట్టిగా నిలదీసి అడుగుతానని డిల్లీ వెళ్ళివచ్చిన ముఖ్యమంత్రి, “గత 10 ఏళ్లుగా ప్రత్యేక హోదా కలిగి ఉన్న 10 రాష్ట్రాలు ఇంతవరకు ఏమాత్రం అభివృద్ధి సాధించలేకపోయాయి. కనుక ప్రత్యేక హోదా మనకి అవసరమా? అని ప్రశ్నించారు. మరి అటువంటప్పుడు దాని కోసం మహానాడులో తీర్మానం చేయడం ఎందుకు?
మళ్ళీ ఆయనే “ప్రత్యేక హోదా ఇస్తే వద్దంటానా?” అని ప్రశ్నిస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వనని ఖరాఖండిగా చెపుతున్నా కూడా కేంద్రంతో స్నేహంగా ఉంటూనే దానిని సాధించుకొందామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెపుతుంటారు. ప్రత్యేక హోదా విషయంలో భాజపా ధైర్యంగా తన మనసులో మాట చెప్పేసి ఎటువంటి పరిణామాలనైనా ఎదుర్కోవడానికి సిద్దపడింది. కానీ తెదేపా మాత్రం ఇంకా ప్రజలతో దాగుడు మూతలు ఆడుతూనే ఉంది.
ఒకవేళ మహానాడులో దాని కోసం తీర్మానం ప్రవేశపెడితే అది ప్రజలను మభ్యపెట్టేందుకేనని భావించవలసి ఉంటుంది. దాని వలన చివరికి అదే మూల్యం చెల్లించవలసి రావచ్చు. కనుక ఈ మహానాడు సమావేశాలలో ప్రత్యేక హోదా కోసం తీర్మానం ప్రవేశపెట్టేబదులు, దానిపై తమ పార్టీ వైఖరి స్పష్టం చేస్తే తక్కువ నష్టంతో బయటపడగలదు.