ఫిరాయింపుల విషయంలో ఇప్పటికే చంద్రబాబు సర్కారు బాగా విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే! వైకాపా నుంచి వచ్చిన జంప్ జిలానీలతో ఇంతవరకూ రాజీనామాలు చేయించలేదు. ఉప ఎన్నికల ఊసెత్తడం లేదు. ఇలాగే మరో రెండేళ్లు టైంపాస్ చెసెయ్యొచ్చు! కానీ, ఎన్నో ఆశలతో వచ్చిన జంప్ జిలానీల కోరికలు తీర్చాలి కదా! త్వరలో జరగబోయే మంత్రివర్గ విస్తరణలో ఎలాగూ ఓ ముగ్గురు వైకాపా ఎమ్మెల్యేలకు పదవులు ఇవ్వాలి. ఇవ్వకపోతే వారు ఊరుకునేలా లేరు. ఇస్తే, విపక్షం ఊరుకునేలా లేదు! విస్తరణ ఇన్నాళ్లూ వాయిదా పడుతున్న కారణాల్లో ఇదీ ఒకటి. అందుకే, ఒకే దెబ్బతో రెండు పిట్టలు అన్నట్టుగా… జంప్ జిలానీల్లోని ఓ ముగ్గురుతో రాజీనామాలు చేయించే ఆలోచనలు తెలుగుదేశం ఉందని విశ్వసనీయ సమాచారం!
విజయనగరం జిల్లా బొబ్బిలి నుంచి సుజయ్ కృష్ణ రంగా, నంద్యాలలో భూమా నాగిరెడ్డి, పలమనేరులో అమరనాథరెడ్డి… ఈ ముగ్గురికీ మంత్రిపదవులు ఇస్తారని బాగానే ప్రచారం జరుగుతోంది. విస్తరణ అయిన వెంటనే వీరుతో రాజీనామాలు చేయించి… ఉప ఎన్నికలకు దింపాలన్నది బాబు వ్యూహంగా చెబుతున్నారు. దీంతో విపక్షాల నోరు మూయించే అవకాశం ఉంటుందనీ, విలువైన రాజకీయాలు చేస్తున్నామని గట్టిగా చెప్పుకునే చాన్స్ వస్తుందీ అనేది వ్యూహంగా తెలుస్తోంది.
అయితే, ఈ ముగ్గురే ఎందుకూ… ఇంకా చాలామంది జంప్ జిలానీలు ఉన్నారుగా, వారితో కూడా రాజీనామాలు చేయించొచ్చు కదా అనే ప్రశ్న రావొచ్చు! ఉప ఎన్నికలకు వెళ్తే అందరూ గెలుస్తారన్న నమ్మకం తెలుగుదేశం పార్టీకి లేదన్నది సుస్పష్టం. ఈ ముగ్గురూ ఎవరి నియోజక వర్గాల్లో వారు స్థానికంగా బలమైన నాయకులు. పార్టీకి అతీతంగా వీరికి పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారట. కాబట్టి, వీరి గెలుపు ఖాయం అనే ధీమా టీడీపీకి ఉందట! అందుకే వీరినే బరిలోకి దింపడం సేఫ్ గేమ్ అన్నట్టు భావిస్తున్నారట.
ఈ ముగ్గురి విజయ ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉండేలా భారీ ప్రచారం చేసుకునే అవకాశమూ ఉంటుంది కదా! మొత్తానికి, ఇన్నాళ్లకు జంప్ జిలానీల విషయంలో తెలుగుదేశంలో కాస్త కదలిక వస్తోందని తెలుస్తోంది. మరి, ఇన్నాళ్లూ ఈ తెలివి ఎందుకు లేదో..? ఈ ఆలోచన ఎందుకు రాలేదో..? వీరు సరే, మిగతావారి సంగతేంటో..?