ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వబోమని కేంద్రం తేల్చిచెప్పడం వలన రాష్ట్రంలో తెదేపా, భాజపాలకి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవలసి వస్తోంది. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రులు, తెదేపా నేతలు మోడీ ప్రభుత్వంపై చాలా ఆగ్రహం వ్యక్తం చేసి విమర్శలు గుప్పించినా మళ్ళీ ‘కేంద్రంతో సఖ్యతగా ఉంటూనే అన్నీ సాధించుకొంటామనే’ పాత పల్లవి అందుకొన్నారు. కానీ అంతమాత్రన్న తెదేపా-భాజపాల మధ్య పెరిగిన దూరం మళ్ళీ తగ్గిపోదు. కేంద్రం పట్ల మెతక వైఖరి వలన తెదేపాకి నష్టం జరగకుండా ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, తెదేపా నేతలకి కూడా తెలుసు. అయినా ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకొంటే పార్టీకి, ప్రభుత్వానికి, రాష్ట్రానికి కూడా ఇంకా ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉందనే ఆలోచనతోనే చంద్రబాబు నాయుడు వెనుకడుగు వేశారనుకోవచ్చు. అయితే కేంద్రంపై తమ ఆగ్రహం, నిరసన తెలియజేసేందుకు రాజ్యసభ ఎన్నికలను వాడుకోవాలని తెదేపా భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రెండేళ్ళ క్రితం తెదేపా కోటాలో నిర్మలా సీతారామన్ కి రాజ్యసభ సీటు కేటాయించారు. ఆమె పదవీకాలం ఈ జూన్ నెలతో పూర్తయిపోతుంది. ఆమెకి మళ్ళీ తెదేపా తరపున సీటు కేటాయించకూడదని భావిస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి తెదేపా-భాజపా సంబంధాలు బాగున్న సమయంలో కేంద్రమంత్రి వెంకయ్య నాయుడికి ఈసారి తెదేపా తరపున సీటు కేటాయించాలని అనుకొన్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఆయనకి కూడా కేటాయించే అవకాశం లేదని తెలుస్తోంది.
రాష్ట్రంపట్ల కేంద్రం నిర్లక్ష్య వైఖరి, ఇరు పార్టీల సంబంధాల దృష్ట్యా తెదేపా నిర్ణయం సబబుగానే కనిపించవచ్చు కానీ రాష్ట్రం కోసం డిల్లీలో చాలా గట్టిగా కృషి చేస్తున్న వెంకయ్య నాయుడుకి తెదేపా సీటు కేటాయించకపోవడం వలన, కేంద్ర, రాష్ట్ర సంబంధాలు, తెదేపా-భాజపా సంబంధాలు ఇంకా దెబ్బ తినవచ్చు. దాని వలన రాష్ట్రానికి ఇంకా నష్టం కలుగవచ్చు. కేంద్రంతో సఖ్యతగా ఉందామని చంద్రబాబు నాయుడు చెపుతున్నప్పుడు అందుకు అనుగుణంగానే వ్యవహరిస్తూ, అందుకు నిదర్శనంగా ఆ ఇద్దరు కేంద్ర మంత్రులకు తెదేపా కోటాలో రాజ్య సభ సీట్లు కేటాయిస్తే, కేంద్రం నుంచి కూడా మళ్ళీ సానుకూల స్పందనలు మొదలవుతాయి.
తెదేపా తరపున డిల్లీలో ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నపటికీ వారికి ప్రధాని నరేంద్ర మోడీతో వెంకయ్య నాయుడుకి ఉన్నంత సాన్నిహిత్యం, పరపతి రెండూ లేవు. ప్రత్యేక హోదా ఇస్తామని ఇవ్వకపోవడం తప్పే. అందుకు ప్రధాని నరేంద్ర మోడీదే బాధ్యత వహించాలి తప్ప వెంకయ్య నాయుడు, నిర్మలా సీతారామన్ లను నిందించడం, ఆ కారణంగా వారిని దూరం చేసుకోవడం కూడా అనవసరమే. ఆ ఇద్దరూ ప్రత్యేక హోదా ఇవ్వలేకపోయుండవచ్చు కానీ వారి పరిధిలో శక్తిమేర రాష్ట్రానికి చాలా సహాయసహకారాలు అందిస్తున్నారు. ఆ విషయం చంద్రబాబు నాయుడుకి కూడా తెలుసు. ముఖ్యంగా రాష్ట్రానికి డిల్లీలో ఉన్న ఏకైక మంచి మిత్రుడు, శ్రేయోభిలాషి అయిన వెంకయ్య నాయుడుని దూరం చేసుకోవడం మంచి నిర్ణయం కాదు. కనుక అటువంటి శ్రేయోభిలాషులను దూరం చేసుకోవడం ప్రభుత్వానికి, రాష్ట్రానికి కూడా మంచిది కాదు. వారిద్దరినీ ఆంధ్రా నుంచే రాజ్యసభకి పంపించడం వలన రాష్ట్రాభివృద్ధి పూర్తి బాధ్యత వారికి కూడా కట్టబెట్టినట్లు అవుతుంది.
ఈసారి వారిరువురికి తెదేపా తన రాజ్యసభ సీట్లు కేటాయించే అవకాశం లేదని భాజపా గ్రహించడంతో, వారిద్దరినీ భాజపా పాలిత రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి రాజ్యసభకు ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే ఇకపై వారు ఆ రాష్ట్రాల అభివృద్ధి, సంక్షేమానికి బాధ్యులు అవుతారు కనుక వారి దృష్టి ఆ రాష్ట్రాలపైనే ఉంటుంది. కనుక కేంద్రంలో మంచి పలుకుబడి ఉన్న వారిద్దరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే రాజ్యసభకు పంపడం అన్నివిధాల అందరికీ మంచిది.