తిరుపతిలో జరుగుతున్న మహానాడు రెండవరోజు సమావేశంలో నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఒకప్పుడు కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యానికి ముగింపు పలికిన తెదేపా, మళ్ళీ భవిష్యత్ లో జాతీయ రాజకీయాలలో కీలకపాత్ర పోషిస్తుంది,” అని అన్నారు.
ప్రత్యేక హోదా తదితర హామీల కారణంగా తెదేపా, భాజపాల మద్య నానాటికీ దూరం పెరుగుతోంది. వచ్చే ఎన్నికలలో ఆ రెండూ కలిసి పోటీ చేస్తాయో లేదో తెలియదని వాటి నేతలే స్వయంగా చెప్పుకొంటున్నారు. రాష్ట్రంలో భాజపాను బలోపేతం చేసుకొంటామని భాజపా నేతలు చెపుతున్నారు. రాష్ట్రంలో తెదేపాయే శాశ్వితంగా అధికారంలో ఉండాలని చంద్రబాబు చెపుతున్నారు. ఇవన్నీ ఆ రెండు పార్టీలు కలిసి పనిచేయలేని పరిస్థితులు కల్పిస్తున్నాయి.
ఒకవేళ ఆ రెండు పార్టీలు విడిపోతే, భాజపా, వైకాపాలు జత కడతాయో లేదో ఇప్పుడే చెప్పలేము కానీ తెదేపా మాత్రం నితీష్ కుమార్ లేదా మరెవరి నేతృత్వంలోనైనా ఏర్పడబోయే మూడవ కూటమితో జత కట్టడం తధ్యం. ఎందుకంటే, ఒకవేళ భాజపా తెదేపాతో తెగతెంపులు చేసుకొని, మళ్ళీ కేంద్రంలోకి అధికారంలోకి వచ్చినట్లయితే అప్పుడు రాష్ట్రంలో తెదేపా అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలోకి మారినా భాజపా నుంచి ఎటువంటి సహకారం ఉండకపోవచ్చు. పైగా ఊహించని అనేక సమస్యలు కూడా ఎదుర్కోవలసిరావచ్చు. కనుక తెదేపాకు సహకరించే కూటమే కేంద్రంలో అధికారంలో ఉండాలని కోరుకోవడం సహజం.
అందుకు ప్రత్యామ్నాయంగా అవతరించబోతున్న మూడవ కూటమితో చంద్రబాబు చేతులు కలిపి కాంగ్రెస్, భాజపాలను అడ్డుకొనే ప్రయత్నం చేయవచ్చు. ఎప్పటికైనా ప్రధానమంత్రి కావాలని కలలుగంటున్న బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, తన నేతృత్వంలో మూడవ కూటమి ఏర్పాటు చేసుకొని ఆ కలను సాకారం చేసుకోవాలని అనుకొంటున్నారు. అందుకు దేశంలోని తెదేపా వంటి ప్రాంతీయ పార్టీలన్నిటి మద్దతు, సహాయ సహకారాలు ఆయనకి చాలా అవసరం. కనుక తెదేపా ఆయనకి అండగా నిలబడి మూడవ కూటమిని అధికారంలోకి తీసుకు రాగలిగితే తెదేపా కేంద్రంలో మళ్ళీ తప్పకుండా చక్రం తిప్పే అవకాశం ఉంటుంది. ఇదంతా తెదేపా, భాజపాల సంబంధాలు భవిష్యత్ లో ఏవిధంగా ఉంటాయనే దానిపైనే ఆధారపడి ఉంటాయి.