కేంద్ర బడ్జెట్, రైల్వే బడ్జెట్ రెంటిలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీల ప్రసక్తి లేకపోవడంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేయడం అందరికీ తెలుసు. బడ్జెట్ ప్రవేశపెట్టక మునుపే ఆయన ఆర్ధికమంత్రి అరుణ్ జైట్లీని కలిసి రాష్ట్రానికి తగినన్ని నిధులు కేటాయించాలని కోరినా ఆయన పట్టించుకోకపోవడం చంద్రబాబుకి అవమానకరమే. కనీసం రాజధాని, పోలవరం నిర్మాణం కోసమయినా బడ్జెట్ లో నిధులు కేటాయించి ఉండి ఉంటే ఆయన మాటకు విలువిచ్చినట్లు ఉండేది. నిజానికి ఆ రెంటికీ బడ్జెట్ లో ఓ 5-10,000 కోట్లు కేటాయించడం కేంద్రానికి పెద్ద కష్టం కాదు అయినా కేటాయించలేదు. అందుకే రాష్ట్ర బడ్జెట్ లో అమరావతికి రూ.1500 కోట్లు, పోలవరానికి రూ.3,600 కోట్లు కేటాయించారు. అది మరోవిధంగా కేంద్రం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేయడంగానే భావించవచ్చును.
చంద్రబాబు నాయుడు నిన్న లండన్ వెళ్ళే ముందు డిల్లీలో ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీని, హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని కలిసి రాష్ట్రంలో పరిస్థితులన్నీ వివరించి, హామీలన్నిటినీ నిలబెట్టుకోవాలని గట్టిగా నొక్కి చెప్పారు. దానికి వారు మళ్ళీ అంతే గట్టిగా మరోమారు హామీలు ఇచ్చేరు.
2014 సార్వత్రిక ఎన్నికలలో ఎన్డీయే కూటమి తప్పకుండా విజయం సాధించి కేంద్రంలో అధికారంలోకి వస్తుంది కనుక భాజపాతో పొత్తులు పెట్టుకొన్నట్లయితే విభజనతో దెబ్బ తిన్న రాష్ట్రాన్ని మళ్ళీ గాడిన పెట్టడానికి అది సహాయసహకారాలు అందిస్తుందనే ఉద్దేశ్యంతోనే చంద్రబాబు నాయుడు భాజపాతో పొత్తులు పెట్టుకొన్నారని అందరికీ తెలుసు. కానీ 22 నెలలు గడిచిపోయినా ఆయన అనుకొన్న ఆ అసలు ప్రయోజనం నెరవేరనే లేదు. అది నేరవేరనప్పుడు ఇంకా భాజపాతో పొత్తులు పెట్టుకోవడం వలన తెదేపా పట్ల కూడా రాష్ట్ర ప్రజలలో వ్యతిరేకత పెరిగితే దాని వలన అది కూడా నష్టపోవచ్చును. పైగా హామీల అమలుకోసం చంద్రబాబు నాయుడు కేంద్రంపై గట్టిగా ఒత్తిడి తేవడం లేదని జగన్ నిత్యం ఆరోపిస్తూనే ఉన్నారు. ఆ కారణంగా రాష్ట్రంలో తెదేపాకి రాజకీయంగా ఎంతో కొంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది.
ఇటీవల రాజమండ్రిలో భాజపా నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాట్లాడుతూ “కేంద్రం చాలా సహాయం చేస్తున్నప్పటికీ, తమ పార్టీపై, కేంద్రప్రభుత్వం రాష్ట్రంలో దుష్ప్రచారం జరుగుతోందని, ప్రజలలో నెలకొన్న ఆ అనుమానాలు, అపోహలు తొలగించడానికే తాను వచ్చేనని” చెప్పడం తెదేపాని ఉద్దేశ్యించేనని స్పష్టం అవుతోంది. రాష్ట్రంలో తెదేపాకు ప్రత్యామ్నాయంగా భాజపా ఎదగాలనే ఉద్దేశ్యంతోనే నిర్వహించిన సభ అది. కనుక తెదేపా పట్ల భాజపా వైఖరి ఏమిటో చాలా స్పష్టంగానే చెప్పినట్లుగానే భావించవచ్చును. రాష్ట్రంలో భాజపా బలపడేందుకు పావులు కదపడం మొదలుపెట్టింది. ఆ ప్రయత్నాలలో భాగంగానే తెదేపా ప్రభుత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సోము వీర్రాజుని రాష్ట్ర అధ్యక్షుడుగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఒకవేళ వచ్చే ఎన్నికలలో కూడా తెదేపాతో కలిసి పోటీ చేయాలని భాజపా అధిష్టానం భావిస్తున్నట్లయితే, తమ కూటమికి నష్టం కలిగించే విధంగా వ్యవహరించకూడదు కానీ వ్యవహరిస్తోందంటే భాజపా ఉద్దేశ్యం ఏమిటో అర్ధమవుతోంది. కనుకనే చంద్రబాబు నాయుడు వైఖరిలో కూడా మార్పు కనబడుతోందని భావించవచ్చును.
పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత రాష్ట్రానికి ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజి, రైల్వే జోన్ తదితర హామీలపై స్పష్టత ఇస్తామని అరుణ్ జైట్లీ నిన్న చంద్రబాబు నాయుడుకి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆలోగానే రాష్ట్ర భాజపా అధ్యక్షుడు ఎవరనే సంగతి కూడా తేలిపోతుంది. కనుక అప్పటికీ కేంద్రం తన హామీలను అమలు చేయకుండా తెదేపా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వ్యక్తిని రాష్ట్ర భాజపా అధ్యక్షుడిగా నియమిస్తే, ఇంకా చంద్రబాబు నాయుడు కూడా భాజపాతో పొత్తులు కొనసాగించడంపై పునరాలోచించవచ్చును.