ప్రత్యేక హోదాపై ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు వెనక్కి తగ్గినట్లు కనబడుతున్నా భాజపాతో తెగతెంపులు చేసుకొని కేంద్ర ప్రభుత్వం, భాజపాపై యుద్ధం ప్రకటించడానికి పార్టీ నేతలని సిద్దం చేస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. రెండు రోజుల క్రితం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర విశాఖలో మీడియాతో మాట్లాడుతూ, “ప్రత్యేక హోదాపై వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సరయిన సమయంలో సరైన నిర్ణయం తీసుకొంటారు,” అని చెప్పారు. మళ్ళీ ఇవ్వాళ్ళ ఆనం వివేకానంద రెడ్డి నోట కూడా సరిగ్గా అవే మాటలు వినిబడటం యాదృచ్చికం మాత్రం కాదనే చెప్పవచ్చు. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న ఆరోపణల వలన రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో పార్టీ, ప్రభుత్వం, తన ఇమేజ్ కి చాలా డ్యామేజి జరుగుతున్న సంగతి చంద్రబాబు నాయుడు గుర్తించలేదని అనుకోలేము. కానీ ఏదయినా ఆచి తూచి నిర్ణయం తీసుకొనే అలవాటున్న చంద్రబాబు నాయుడు, జగన్ విమర్శలకు భయపడి హడావుడిగా భాజపాతో తెగతెంపులు చేసుకొంటే దాని వలన లాభం కంటే నష్టమే ఎక్కువని గ్రహించడం వలననే సంయమనం కోల్పోకుండా వ్యవహరిస్తున్నారని భావించవచ్చు.
కేంద్రంతో సఖ్యతగా ఉన్నా కూడా అది రాష్ట్రానికి తగినన్ని నిధులు విదిలించడం లేదు…ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటకి ఏ మాత్రం విలువ ఇవ్వడం లేదని సంగతి ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజల మనసులలో అది బాగా నాటుకొనేలాగ చేసిన తరువాతే భాజపాతో తెగతెంపులు చేసుకొన్నట్లయితే, దానితో జగన్ కూడా పొత్తులు పెట్టుకొనే సాహసం చేయలేకపోవచ్చు. తద్వారా ఒకేసారి భాజపా, వైకాపాలకు చెక్ పెట్టవచ్చని చంద్రబాబు నాయుడు భావిస్తున్నారేమో? ఈలోగా పార్టీని సన్నదం చేసుకొనే అవకాశం కూడా ఆయనకి ఉంటుంది.
“భాజపా మా మిత్రపక్షం దానితో మా బంధాన్ని ఎవరూ విడదీయలేరు…” వంటి రొటీన్ పల్లవిని ఆలపించే బదులు “సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొంటామని” తెదేపా మంత్రులు, నేతలు కొత్త పల్లవి ఆలపించడానికి అర్ధం అదేనని భావించవచ్చు.