తెదేపాని జాతీయ పార్టీగా ప్రకటించుకొని ఏడాది అయ్యింది. దానికి వీలుగా పార్టీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొన్నారు. తరువాత అండమాన్ నికోబార్ దీవుల స్థానిక సంస్థల ఎన్నికలలో ఒకసారి పోటీ చేసింది. ఇటీవల పొరుగు రాష్ట్రమైన తమిళనాడు శాసనసభ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం కలిగినా అందుకు పార్టీ సిద్ధంగా లేకపోవడంతో పోటీ చేయలేదు. పొరుగునున్న తమిళనాడు, కర్నాటక, మహారాష్ట్ర, ఓడిశా రాష్ట్రాలలో తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాలకి తెదేపాని విస్తరించి 2019 ఎన్నికలలో పోటీ చేయాలని అనుకొన్నారు కానీ ఇంతవరకు ఆ రాష్ట్రాలలోకి పార్టీని విస్తరించే ప్రయత్నాలు చేయలేదు.
ఆంధ్రాకి ఆనుకొని ఉన్న దక్షిణ ఓడిశాలో బరంపురం, గంజాం, కోరాపుట్, రాయగడ, మల్కన్ గిరి, గజపతి, నౌరంగపూర్ ప్రాంతాలలో తెలుగు ప్రజలు చాలా మంది స్థిరపడ్డారు. వారిలో కొందరు ప్రముఖులు తెదేపా నేతలతో మంతనాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. తమ ప్రాంతాలకి తెదేపాని విస్తరించినట్లయితే, దానికి యధాశక్తిగా సహకరిస్తామని హామీ ఇస్తున్నారు.
కేంద్ర పౌరవిమాన శాఖ మంత్రి అశోక్ గజపతి రాజు నిన్న బరంపురంలో పర్యటించినపుడు విలేఖరులు అడిగిన ఒక ప్రశ్నకి బదులిస్తూ, “తెదేపా ఇప్పుడు ఏదో ఒక రాష్ట్రానికే పరిమితమైన ప్రాంతీయ పార్టీ కాదు. ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో అది చాలా బలంగా ఉంది. త్వరలో మరికొన్ని రాష్ట్రాలకి కూడా పార్టీని విస్తరించాలని అనుకొంటున్నా మాట వాస్తవమే. ఓడిశాలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండే కొన్ని ప్రాంతాలకి తెదేపాని విస్తరించాలని భావిస్తున్నాము. కానీ మా పార్టీ ఎన్డీయే కూటమిలో భాగస్వామిగా ఉన్నందున మా అంతట మేము అటువంటి నిర్ణయాలు తీసుకోవడం సబబు కాదు. భాజపాతో కలిసి ఆలోచించుకొని తగిన నిర్ణయం తీసుకొంటాము,” అని చెప్పారు.
తెదేపా జాతీయ పార్టీగా ప్రకటించుకొన్నప్పటికీ, కేంద్ర ఎన్నికల సంఘం దానికి ఆ హోదా మంజూరు చేయాలంటే ఆంధ్రప్రదేశ్ కాకుండా కనీసం మరో మూడు రాష్ట్రాలలో తెదేపా నిర్దిష్ట శాతం ఓట్లు సంపాదించుకోవలసి ఉంటుంది. వచ్చే ఎన్నికలలో ఆ ప్రయత్నం చేస్తామని తెదేపా ప్రకటించింది. అశోక్ గజపతి రాజు చెప్పిన దాని ప్రకారం తెదేపా, భాజపాలు కలిసి ప్రయత్నిస్తే అది సాధ్యమే. కానీ తెలంగాణాలో ఇప్పటికే అవి దూరం అయ్యేయి. ఆంధ్రాలో వాటి మద్య అంత సఖ్యత కనబడటం లేదు. వచ్చే ఎన్నికలలో కలిసి పోటీ చేస్తాయో లేదో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల వరకు ఎదురుచూసి, అప్పుడు అకస్మాత్తుగా ఇతర రాష్ట్రాలలో అడుగుపెట్టి పోటీ చేసినా అక్కడి ప్రజలను ఆకట్టుకొని విజయం సాధించడం చాలా కష్టం. కనుక భాజపా అనుమతి కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం కంటే ఇరుగుపొరుగు రాష్ట్రాలకి తెదేపాని విస్తరించడానికి చిన్నగా ప్రయత్నాలు మొదలుపెడితే మంచిది కదా.