కె.ఎల్. యూనివర్శిటీలో మూడు రోజులుపాటు తెలుగుదేశం నేతలకు శిక్షణ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే, చివరి రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతులు మీదుగా ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇన్ఛార్జ్లు కొన్ని కవర్లు అందుకున్నారు. ఆ కవర్లన్నీ సీల్ చేసి ఉన్నాయి. ఈ కవర్లలో ఏముంది అనే విషయం బహిర్గతం చేయకూడదని ముందే చంద్రబాబు హెచ్చరించారట! దీంతో ఈ కవర్లపై తెలుగుదేశం శ్రేణుల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోందని తెలుస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆ కవర్లలో నాయకుల పనితీరుపై ప్రగతి నివేదికలు ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కో నాయకుడికీ మొత్తం 8 పేజీల్లో ప్రగతి నివేదికను తయారు చేసి, అందించినట్టు చెబుతున్నారు. మొదటి పేజీలో నాయకుల గ్రేడ్లు, నియోజక వర్గానికి సంబంధించిన సమాచారం క్రోడీకరించారట. రెండో పేజీల నాయకుల బలాలూ బలహీనతలు రాశారని సమాచారం. మూడోపేజీలో పార్టీ పరిస్థితి గురించి సవివరంగా రాశారట. ఐదో పేజీలో సదరు నాయకుడి వ్యక్తిగత దందాల గురించి కాస్త కఠిన వ్యాఖ్యలనే పొందుపరచారట. ఆరో పేజీలో నాయకుల ప్రతిపక్షాన్ని ఎదుర్కోవడంలో ఎలా ఫెయిల్ అయ్యారు, పార్టీ కార్యక్రమాల్లో ఎంత క్రియాశీలంగా ఉంటున్నారన్నది రాశారట. ఏడు, ఎనిమిది పేజీల్లో నాయకులు చేసిన తప్పొప్పులూ ప్రజలకు అందుబాటులో ఉంటున్న తీరుపై విశ్లేషణ చేశారట.
ఇక, గ్రేడ్లు విషయానికొస్తే నాయకులకు నాలుగు గ్రేడ్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. చివరి రెండు గ్రేడ్లు పొందిన నాయకుల నివేదికల్లో కాస్త కఠిన పదజాలంతోనే మందలింపులు ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. అందుకే, ఈ నివేదికల గురించి ఏ నాయకుడూ ఎక్కడా ఆఫ్ ద రికార్డ్‌గా కూడా మాట్లాడే సాహసం చేయడం లేదని అంటున్నారు. అంతేకాదు, ఈ ప్రగతి నివేదికల ప్రక్రియ ఇకపై ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఉంటుందని చెబుతున్నారు. ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇన్ఛార్జ్లపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తున్నట్టు ఈ మధ్యనే నారా లోకేష్ కూడా చెప్పారు. ఇకపై, ఈ ప్రక్రియ నిరంతరాయంగా కొనసాగుతుందన్నమాట. వాటి ఆధారంగానే నాయకుల గ్రేడ్లు, భవిష్యత్తులో పార్టీ పదవులూ సీట్లూ కూడా ఉంటాయని లోకేష్ మొన్ననే చెప్పారు. మొత్తానికి ఈ ప్రోగ్రెస్ రిపోర్టులు తెలుగుదేశం శ్రేణుల్లో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రతీ మూడు నెలలకోసారి ఇలాంటి నివేదికలు అందుకోవాల్సి వస్తుందన్న విషయం దేశం నేతలకు గుబులు పుట్టిస్తోందని చెబుతున్నారు!