తెలంగాణలో టిడిపి మనుగడ దుస్సాధ్యం గనక టిఆర్ఎస్లో విలీనం చేయడమే మంచిదని సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నరసింహులు చేసిన వ్యాఖ్యలు దుమారం సృష్టించాయి.ఆయన ఆ పార్టీలో ప్రవేశించడానికే ఇవన్నీ మాట్లాడుతున్నారని అభిప్రాయం ఏర్పడింది.అయితే మోత్కుపల్లి శిబిరం ఆలోచన మరోలా వుంది. ఇప్పటికి దాదాపు పదేళ్లుగా తనకు వ్యక్తిగతంగా జరుగుతున్న అన్యాయాలు ఆశాభంగాల కారణంగానే ఆ దళిత నేత ఆగ్రహించారని చెబుతున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో టిఆర్ఎస్ కెసిఆర్ దాడులు చేస్తున్నప్పుడు అందరూ నోరు మూసుకుంటే ధైర్యంగా చంద్రబాబు పక్కన నిలిచింది మోత్కుపల్లి మాత్రమేనని వారు గుర్తు చేస్తున్నారు.అయినా రాజ్యసభ స్థానం తనకు ఇవ్వకుండా గరికపాటికి ఇవ్వడం చాలా బాధాకరమైందట. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పార్టీ నాయకత్వం తనకు గాక రమణకు ఇవ్వడం, మరో నాయకుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటుతో చేటు తేవడం జరిగిందంటే వారిని నియమించిన చంద్రబాబుకు బాధ్యత వుండదా అని కూడా ప్రశ్నిస్తున్నారు. మోడీ ప్రభుత్వం ఏర్పడ్డాక గవర్నర్ పదవి ఇప్పిస్తామని చెప్పి ప్రత్యేక హౌదాకు దానికి పోటీ పెట్టి మరోసారి అన్యాయం చేశారని వీరి ఆరోపణ. ఏదో విధంగా తనకు న్యాయం చేసే విధానం ఆలోచించేబదులు తను టిఆర్ఎస్లో చేరడానికే ఇదంతా చేస్తున్నానరి దుష్ట్రచారాన్ని ఎందుకు అనుమతిస్తున్నారని సన్నిహితుల దగ్గర మోత్కుపల్లి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెసిఆర్ తనకు మొదటి నుంచి మంచి మిత్రుడైనా రాజకీయంగా వ్యతిరేకించానని ఇప్పుడు మాత్రం ఎందుకు అటు చేరతానని మరో ప్రశ్న వేస్తున్నారు. ఎపి నుంచైనా తనకు రాజ్యసభకు అవకాశం ఇవ్వాలనే ఆకాంక్ష ఆయనకు వున్నట్టు కనిపిస్తుంది. అయితే ఎన్టీఆర్ వర్ధంతిరోజున కూడా చంద్రబాబు రాకపోవడం బాధ కలిగించినందువల్లనే అలా మాట్లాడాను తప్ప పదవుల కోసం కాదంటారు. ఇప్పుడు మాత్రం టిడిపిని టిఆర్ఎస్లో విలీనం చేసినట్టు కాదా? ఒంటేరు ప్రతాపరెడ్డిని కేసిఆర్ ప్రభుత్వం ఇరవై రోజులుగా జైలులో పెడితే అధినేత ఖండించాడా అన్నది ఆయన ప్రశ్న. ఏ విషయంలోనైనా స్పందిస్తున్నారా?ఏమీ చేయనప్పుడు పార్టీ పతాకాన్ని మోయడమెందకని ఆగ్రహిస్తున్నారు.