స్థానిక ఎన్నికల విషయంలో ఎస్ఈసీ తీరుకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు సిద్ధపడ్డారని టీడీపీ నేత దేవినేని ఉమ చెబుతున్నారు. గవర్నర్ వద్ద అదే మాట చెప్పారని.. కానీ సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సైలెంట్‌గా ఎన్నికలకు సిద్ధమయ్యారని ఎద్దేవా చేశారు. అయితే అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్లుగా ఎస్ఈసీ మీద కోపం వస్తే జగనమోహన్ రెడ్డి తన పదవిని ఎందుకు వదులుకుంటాడన్నది లాజిక్కు అందని సందేహం. జగన్మోహన్ రెడ్డి పదవికి రాజీనామా చేస్తాడని దేవినేని ఉమ మొదటి సారి చెప్పడం లేదు. ఇలాంటి ఇష్యూ జరిగినప్పుడల్లా ఆయన ఇలా చెబుతూనే ఉంటారు. దీనిపై ఆయనకు ఖచ్చితమైన సమాచారం ఉందో.. రాజకీయ వ్యూహాలలో భాగమో.. లేకపోతే.. జగన్మోహన్ రెడ్డి మైండ్ సెట్.. వ్యవహారశైలి పూర్తిగా అధ్యయనం చేసి… ఇలాంటి సందర్భాల్లో ఇలా వ్యవహరిస్తారని అంచనా వేస్తారో కానీ… గతంలో కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటున్న మొదట్లోనే… దేవినేని ఉమ ఇలాంటి ప్రకటనలు చేశారు. రెండు, మూడేళ్లలోనే జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేస్తారని… ప్రకటించారు. ఎందుకని అలా అంటే.. తన మాటలు చెల్లుబాటు కావడం లేదన్న ఆవేశంతో రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్తాడని ఆయన విశ్లేషించారు. ఆ తర్వాత కూడా ఎప్పుడైనా రాజీనామా చేసే అవకాశం ఉందని ఒకటి రెండు సార్లు చెప్పారు. ఇప్పుడు ఎస్ఈసీ విషయంలో మరో అడుగు ముందుకేసి.. గవర్నర్ వద్దకెళ్లి తాను రాజీనామా చేస్తానని చెప్పినట్లుగా ప్రకటించారు. అక్కడ నిజంగా చెప్పారో లేదో ఎవరికీ క్లారిటీ లేదు. కానీ దేవినేని ఉమ మాత్రం.. జగన్మోహన్ రెడ్డితో ఓ మైండ్ ఆడుతున్నారన్న అభిప్రాయం మాత్రం వ్యక్తమవుతోంది.
గతంలో హైకోర్టుల్లో వరుస వ్యతిరేక తీర్పులు వస్తున్నప్పుడు.. పాలనను అడ్డుకుంటున్నారని తీవ్రమైన ప్రచారం చేశారు. ఆ కారణంగానే కోర్టుల తీరును ఎత్తి చూపుతూ రాజీనామా చేసి మళ్లీ ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తున్నారన్న అభిప్రాయం కొంత మందిలో ఏర్పడింది. అయితే ఆ తర్వాత పరిస్థితి సద్దుమణింగింది. ఇప్పుడు కోర్టులు ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నా.. గతంలోలా దూకుడుగా ఉండటం లేదు. చంద్రబాబు మేనేజ్ చేశారని అనడం లేదు. అయితే పరిస్థితి ముందు ముందు ఇలానే ఉంటుందని చెప్పలేం. జగన్మోహన్ రెడ్డి తీసుకున్న కొన్ని నిర్ణయాలు… మండలి రద్దు … మూడు రాజధానులు వంటి వాటిని చూస్తే.. ఎప్పుడైనా జగన్… ఆవేశంలో రాజీనామా చేసేసి.. ఎన్నికలకు వెళ్లినా ఆశ్చర్యం లేదని టీడీపీ వర్గాలు గట్టిగా నమ్ముతున్నాయి. కొంతమంది వైసీపీ నేతల్లోనూ అదే అభిప్రాయం ఉంది.