చంద్రబాబు మంత్రివర్గంలో మార్పు చేర్పులు చేస్తారని ప్రచారం ప్రారంభం కాగానే కేబినెట్ లో ఉన్న మంత్రులపై చిత్ర విచిత్రమైన కథనాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఏపీకి చెందిన ఓ డార్లింగ్ మంత్రి తెలంగాణలో దందాలు చేస్తున్నారని మీడియాకు లీకులు వచ్చాయి. తెలంగాణ ఇంటలిజెన్స్ వర్గాలు పూర్తి సమాచారం సేకరించి ఆ విషయాన్ని చంద్రబాబుకు కూడా ఇచ్చాయని చెబుతున్నారు. ఆ మంత్రి ఎవరన్నదానిపై క్లారిటీ లేదు కానీ.. ఆయనకు డార్లింగ్ మంత్రి అని పేరు పెట్టారు.
ఆయన రెండు రోజులు ఏపీలో.. రెండు రోజులు నియోజకవర్గంలో.. మూడు రోజులు హైదరాబాద్లోని ఓ స్టార్ హోటల్లో మకాం వేసి దందాలు, విందులు, వినోదాల్లో మునిగి తేలుతున్నారట. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లోనూ ఆయన జోక్యం చేసుకుంటున్నారని.. అందుకే ఆయన గురించి మొత్తం బయటకు తీసి చంద్రబాబుకు చెప్పారని అంటున్నారు. చంద్రబాబు కూడా ఈ వ్యవహారాలపై నిఘా పెట్టి సమాచారం సేకరించారని కూడా చెబుతున్నారు. విజయవాడలోనూ ఆయనకు స్టార్ హోటల్ లో క్యాంపు ఉందని అంటున్నారు.
ఈ మంత్రి ఎవరో కానీ ఆయనను తప్పించేందుకు తెలంగాణ వైపు నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయని అనుకోవచ్చు. ఇలాంటి దందాలు నిజంగా చేస్తే చంద్రబాబు తప్పించడం ఖాయమని అనుకోవచ్చు. ఆయన మొదటి సారి ఎమ్మెల్యే కాదు. రెండో సారి ఎమ్మెల్యే. ఎమ్మల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయన ఇదే తరహాలో దందాలు చేసేవారట. అంటే మంత్రిగా ఉన్నా తన బిజినెస్ కొనసాగిస్తున్నారని అనుకోవాలి.
కారణాలు ఏమైనా టీడీపీ అంతర్గత రాజకీయాలు, పదవుల పోరాటాల కోసం ఇలాంటి ప్రచారాలు ముందు ముందు చాలా జరిగే అవకాశం ఉంది. మార్చిలో నాగబాబుకు మంత్రి పదవి ఇవ్వనున్నాయి. ఆ సమయంలో కొంత మంది మంత్రుల్ని మార్చుతారని అంటున్నారు. ఈ క్రమంలో ఈ రెండు నెలల్లో చాలా మందిపై ఇలాంటి ప్రచారాలు రావొచ్చు. టీడీపీ కార్యకర్తలు కొన్ని పత్రికలు రాసేవి వంద శాతం నిజం అనిపిస్తాయి. సొంత పార్టీ నేతల్ని వారు నమ్మలేరు.. వీరు చెప్పిందే నిజమనుకుంటారు. అందుకే ఇలాంటి వార్తలు మరిన్ని వస్తాయి. నిజం మాత్రం ఆ మంత్రికి.. రాసిన వాళ్లకు.. మాత్రమే తెలియాలి.