శాసన సభ సమావేశంలో సవాళ్లు… ప్రతి సవాళ్లతో మార్మోగిపోయింది! అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన భూముల వ్యవహారం సభలో చర్చకు వచ్చింది. ఈ సందర్భంగా ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అగ్రిగోల్డ్ సంస్థకు సంబంధించిన భూములను పుల్లారావు భార్య కొనుగోలు చేశారంటూ జగన్ ఆరోపించారు. అయితే, తనకూ ఆ సంస్థకూ ఎలాంటి సంబంధాలు లేవంటూ పుల్లారావు తిప్పికొట్టారు. ఆ భూములు తమవి అని రుజువు చేస్తే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా అంటూ మంత్రి పుల్లారావు సవాల్ చేశారు. ఒకవేళ అలా రుజువు చేయని పక్షంలో జగన్ రాజకీయాల నుంచి తప్పుకుంటారా అంటూ ఛాలెంజ్ విసిరారు.
ఆ తరువాత, పుల్లారావుకు మద్దతుగా నిలిచేందుకు యనమల రామకృష్ణుడు మాట్లాడారు. ఈయనో కొత్త ప్రతిపాదన సభలో ప్రస్థావించారు. మంత్రిగారిపై చేసిన ఆరోపణలు నిజమని తేలితే ఆయన సభ నుంచి బయటకి వెళ్తారనీ… నిరూపించకపోతే జగన్ కూడా సభ నుంచి బయటకి వెళ్లాలన్నారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు కూడా ఇదే మాట మాట్లాడారు. ఆ ప్రపోజల్ కు మద్దతు ఇచ్చారు. ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇలానే స్పందించారు! జగన్ చేసిన వ్యాఖ్యలు నిజమైతే మంత్రి పుల్లారావును సభకు రానివ్వననీ… తప్పు అయితే జగన్ ని కూడా రానివ్వనంటూ చంద్రబాబు మద్దతు పలికారు. ఈ వివాదంపై కాసేపు రెండు పక్షాల మధ్యా వాగ్వాదం నడిచింది. చివరికి న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్టు ముఖ్యమంత్రి సభలో ప్రకటించారు.
ఏతావాతా ఈ వివాదం ద్వారా అధికార ప్రతిపక్షాలు సాధించింది ఏంటి..? ఎవరికి వారు పంతాలకు పోయినట్టు అనిపిస్తోంది. సరే, ప్రతిపక్షం ఏదో ఒక అంశాన్ని సభలోకి తెచ్చిందే అనుకుందాం. వారి దగ్గరున్న సమాచారం మేరకు.. ఒక ఆరోపణ చేసిందే అనుకుందాం. వాటిలోని వాస్తవాలు ఉంటే ఉన్నాయనీ.. లేదంటే లేవని తిప్పి కొట్టే ప్రయత్నం చేయాలి. వాస్తవాలను చెప్పాల్సిన బాధ్యత అధికార పక్షానికి ఉంటుంది కదా. అంతేగానీ, ఇలాంటి వాదనకు దిగడం ఏ తరహా సంప్రదాయం అనుకోవాలి..!
శాసనసభ అంటే అధికార పార్టీకి చెందినవారి ఆవేశ కావేశాలకు వేదికగా మారిందనే భావన కలుగుతోంది. అగ్రిగోల్డ్ భూముల అంశమై ప్రభుత్వం చేసిన ఈ వాదన అర్థరహితం అనేది అందరికీ అర్థమౌతూనే ఉంటుంది. ఇది చాలదన్నట్టుగా… దీనికి భాజపా సభ్యులు మద్దతు పలకడం మరీ విశేషం. సభలో కాస్త బాగా మాట్లాడతారూ అనే ఇమేజ్ ఉన్న విష్ణు కుమార్ వంటివారు కూడా చంద్రబాబుకు వంత పాడటం విడ్డూరం.