రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకి త్వరలో వైకాపా నేత ఎమ్.వి. మైసూర రెడ్డి నేతృత్వంలో ఉద్యమాలు మొదలుపెట్టబోతున్న వార్తలపై తెదేపామంత్రులు స్పందించడం మొదలుపెట్టారు. తుళ్ళూరులో రాజధాని నిర్మాణ ప్రతిపాదనని, దాని కోసం సారవంతమయిన భూముల సేకరణని మొదటి నుంచి వ్యతిరేకితున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె.ఇ. కృష్ణమూర్తి వారిలో మొదటగా స్పందించారు.
“రాజకీయ నిరుద్యోగులే రాయలసీమ హక్కుల పేరుతో ప్రజలను రెచ్చగొట్టి రాష్ట్రంలో సమస్యలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారు. రాయలసీమ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా కృషి చేస్తున్నారు. సీమ జిల్లాలకు నీటి సమస్య తీర్చేందుకు కృషి చేస్తున్నారు. అలాగే పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నారు. ఆయన కృషి ఫలితంగానే జిల్లాలలో ఐ.ఐ.టి., ట్రిపుల్ ఐటి, ఉర్దూ విశ్వవిద్యాలయం, డి.ఆర్.డి.ఎ. అంబుజా, జైన్ మెగా ఫుడ్, విద్యుత్ ప్రాజెక్టులు వగైరా అనేకం వస్తున్నాయి. మున్ముందు ఇంకా అనేక పరిశ్రమలు స్థాపించబడనున్నాయి. ఇవన్నీ సీమ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వారికి అసంతృప్తి లేదు. కానీ కొందరు పనిపాటు లేని రాజకీయనేతలే పనిగట్టుకొని ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు,” అని కె.ఇ. కృష్ణమూర్తి అన్నారు.
ఆ తరువాత మంత్రి పల్లె రఘునాధరెడ్డి కూడా ఈ వార్తలపై స్పందిస్తూ, “రాయలసీమకి నీటి సమస్యను తీర్చేందుకే ప్రభుత్వం పట్టిసీమ ప్రాజెక్టు చేపడితే, సీమకు చెందిన కొందరు నేతలు గోదావరి జిల్లాలకు దక్కవలసిన నీళ్ళను ప్రభుత్వం సీమకు తరలించుకుపోతోందని అక్కడి ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళే సీమకు అన్యాయం జరిగిపోతోందంటూ ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమాలకు సిద్దం అవుతున్నారు. సీమ నీటి సమస్యలను తీర్చేందుకే ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన హంద్రీ-నీవా,గాలేరు-నగరి వంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తోంది. సీమ జిల్లాలలో చాలా వేగంగా పారిశ్రామికాభివ్రుద్ధికి అనేక ప్రణాళికలు సిద్దం చేసి అమలు చేస్తోంది. తత్ఫలితంగానే అనంతపురంలో కస్టమ్స్ ట్రైనింగ్ సెంటర్, బి.హెచ్.ఈ.ఎల్.,సోలార్ విద్యుత్ ప్రాజెక్టులు, నెల్లూరులో విద్యుత్ ఉత్పత్తి సంస్థలు మరియు పరిశ్రమలు, కర్నూలులో కొత్తగా అనేక పరిశ్రమలు, చిత్తూరులో ఐఐటి వంటి మూడు ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటు అవుతున్నాయి. ఈ ఏడాదిన్నర సమయంలోనే సీమలో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే, కొందరు నేతలు వీటి గురించి మాట్లాడకుండా సీమకు అన్యాయం జరిగిపోతోందని ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమాలకు సిద్దం అవుతున్నారు. అటువంటి వారికి సీమ ప్రజలే గట్టిగా బుద్ధి చెపుతారు,” అని అన్నారు.
ఈ వేర్పాటువాద ఉద్యమాన్ని వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డే వెనుక నుండి ప్రోత్సహిస్తున్నారని తెదేపా నేత వార్ల రామయ్య అభిప్రాయపడ్డారు. “జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం రాజకీయ అవగాహన లేని నాయకుడు. అతను కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ విభజన రేఖలు గీయాలని ప్రయత్నిస్తున్నారు. అతను రాష్ట్రానికి కొత్త సమస్యలు సృష్టించాలని ప్రయత్నిస్తే మేము చూస్తూ ఊరుకోము,” అని హెచ్చరించారు.