కాపులకు రిజర్వేషన్ల కోసం పోరాడుతున్న ముద్రగడ పద్మనాభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని సవాలు చేస్తూ లేఖ వ్రాసినందుకు ఆయనపై మంత్రులు గంటా శ్రీనివాసరావు, చిన రాజప్ప చాలా తీవ్రంగా విమర్శలు చేశారు.
ముద్రగడ తన ఉనికిని చాటు కోవడానికే ముఖ్యమంత్రికి ఆవిధంగా లేఖలు వ్రాస్తున్నారని గంటా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు. “కాపుల కోసం పోరాడుతున్నానని చెప్పుకొంటున్న ముద్రగడ గతంలో ఎన్నడూ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డిని దీని గురించి గట్టిగా అడగలేదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు తనంతట తానుగా కాపులకు మేలు చేసే కార్యక్రమాలు అమలుచేస్తుంటే, ఆయనని ప్రశ్నిస్తున్నారు. ముద్రగడ వెనుక ఖచ్చితంగా జగన్ ఉన్నారు. జగన్ చేతిలో ఆయన కీలుబొమ్మగా మారారు. అందుకే ఆయన ఆడించినట్లు ఆడుతున్నారు. వైకాపాతో తనకు సంబంధం లేదని చెపుతున్న ముద్రగడ, తునిలో నిర్వహించిన కాపు గర్జన సభకు ముందు వైకాపా నేత భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ఆయనని ఎందుకు కలిసారో చెప్పగలరా? ముద్రగడ వాడుతున్న బాష చాలా అభ్యంతరకరంగా ఉంది. అలాగే ఆయన చర్యలు కాపు జాతికి మేలు చేకూర్చకపోగా ఇంకా నష్టం కలిగిస్తున్నాయన్న సంగతి ఆయన గ్రహించాలి,” అని మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు.
ఉప ముఖ్యమంత్రి చిన రాజప్ప మీడియాతో మాట్లాడుతూ, “కాపుజాతికి నాయకుడినని చెప్పుకొంటున్న ముద్రగడ ఎన్నిసార్లు ఎన్నికలలో ఓడిపోయారో అందరికీ తెలుసు. గత మూడు దశాబ్దాలుగా ఏ ముఖ్యమంత్రి కాపులను పట్టించుకోలేదు. వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మేలు చేస్తుంటే, ముఖ్యమంత్రిని విమర్శిస్తూ ముద్రగడ లేఖలు వ్రాస్తున్నారు. ఆయన జగన్ ప్రోద్బలంతోనే ఆ పని చేస్తున్నారు. తన వెనుక జగన్ లేరని అంటున్నారు అది అబద్ధం. ముద్రగడ నిజంగా కాపుల శ్రేయోభిలాషి అయితే వారికి మేలు జరుగుతున్నప్పుడు, ఈవిధంగా రాజకీయాలు చేయకుండా ఉంటే మంచిది,” అని అన్నారు.
తెదేపా మంత్రుల విమర్శలలో దాపరికం ఏమీ లేదు. ముద్రగడని జగన్మోహన్ రెడ్డే నడిపిస్తున్నారని, అందుకే ఆయన లేఖలో, మాటల్లో జగన్ బాష స్పష్టంగా కనబడుతోందని మంత్రి గంటా శ్రీనివాసరావు చెపుతున్నట్లు అర్ధమవుతోంది. కాపుల కోసం పోరాడుతున్న ఆయన, వారికి మేలు చేస్తున్నామని చెప్పుకొంటున్న ప్రభుత్వం ఈవిధంగా ఎందుకు కీచులాడుకొంటున్నారు? అని ఆలోచిస్తే దీనిలో మూడో వ్యక్తి కూడా ఉన్నట్లు స్పష్టమవుతోంది.