శాసనమండలి కార్యదర్సిపై చర్యలు తీసుకుంటామని ఆవేశపడుతున్న తెలుగుదేశం పార్టీ వాటిని అమలు చేయాల్సింది ప్రభుత్వమేననే సంగతిని మర్చిపోతోంది. ఏపీ శాసనమండలి ఛైర్మన్ ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న అధికారులపై సభా ధిక్కరణ నోటీసులు ఇచ్చేందుకు టీడీపీ సన్నద్ధమవుతోంది. నోటీసులు ఇవ్వడంతో పాటు న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుంది. మండలి చైర్మన్ రెండు సార్లు సెలెక్ట్ కమిటీ నియామకం ఉత్తర్వులు ఇవ్వాలని లేకపోతే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటానని హెచ్చరిస్తూ… కార్యదర్శికి ఫైల్ పంపారు. అయినా సరే కార్యదర్శి సెలెక్ట్ కమిటీ నియామకం నిబంధనలకు విరుద్దమని, మండలి కార్యదర్శిగా తాను నిబంధనలకు అనుగుణంగా నడుచుకోవాల్సి ఉందంటూ ఫైల్ ను మళ్లీ వెనక్కి పంపారు.
పదే పదే మండలి కార్యదర్శి… ఛైర్మన్ ఆదేశాలను ధిక్కరించడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా టీడీపీ చెబుతోంది. ధిక్కరణ నోటీస్ ఇవ్వడం వలన దీనిపై బడ్జెట్ సమావేశాలలోనే చర్చించి, నిర్ణయం తీసుకునే సౌలభ్యం కలుగుతుందని టీడీపీ చెబుతోంది. ఎలాగైనా చైర్మన్ ఆదేశాలను ధిక్కరించినందుకు కార్యదర్శి సభా ధిక్కరణ విచారణ ఎదుర్కోవడం ఖాయమని చెబుతున్నారు. ఇక్కడ మౌలికంగా వస్తున్న ప్రశ్న. శానమండలి చర్యలు తీసుకుంటే అమలు చేయాల్సింది ఎవరు..? ఇక్కడ సమాధానం ప్రభుత్వమే.
శాసనమండలి …ఏకగ్రీవంగా శాసనమండలి కార్యదర్శికి జైలు శిక్ష వేయడమో.. సస్పెండ్ చేయడమో.. నిర్ణయం తీసుకుంటే.. దాన్ని అమలు చేయాల్సింది ప్రభుత్వమే. అప్పుడు ప్రభుత్వం మళ్లీ మీకు అధికారం లేదనే సమాధానం ఇస్తే టీడీపీ ఏం చేస్తుందన్నది ప్రశ్నార్థకం. మొత్తానికి శాసనమండలి కార్యదర్శిని శిక్షించాలని మాత్రం..మండలి తీర్మానం చేయగలదు. అమలు మాత్రం చేయలేదు. ఈ లాజిక్ టీడీపీ మిస్సవుతోంది.