టీడీపీ ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ సీఎం జగన్ ను తాను కలవనని తేల్చి చెప్పారు బాలయ్య. సీఎం జగన్ ను కలవడానికి రావాలని తనను పిలిచారని… అయినా తాను వెళ్లలేదని చెప్పారు. టికెట్ ధరలు తక్కువగా ఉన్న సమయంలోనే తన తాజా చిత్రం ‘అఖండ’ ఘన విజయం సాధించి, మంచి వసూళ్లను రాబట్టిందని , తన చిత్రాలు లిమిటెడ్ బడ్జెట్లోనే ఉంటాయని, టికెట్ ధరలు తన చిత్రాలపై ప్రభావం చూపబోవని చెప్పుకొచ్చారు. తన సినిమాల బడ్జెట్ ను తాను పెంచనని వెల్లడించారు బాలయ్య.
గత వారమే సిఎం జగన్ ను చిరంజీవి, మహేశ్ బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ తదితరులు కలిసిన సంగతి తెలిసిందే. ఈ భేటిలో బాలకృష్ణ లేరు. ఆయనే కాదు.. నందమూరి కుటుంబం నుంచి ఎవరూ ఆ భేటిలో ప్రాతినిధ్యం వహించలేదు. ఇప్పుడు తాను జగన్ ని కలిసేది లేదని క్లారిటీగా చెప్పారు బాలయ్య. టికెట్ల ధరతో తనకు సంబంధం లేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. కొన్ని రోజులు క్రితం నాగార్జున కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. తగ్గించి టికెట్ల రేట్లతో తన సినిమా బంగార్రాజుకి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పారు. ఇప్పుడు బాలయ్య కూడా మాట చెప్పడంతో టికెట్ల ధర విషయంలో ఇండస్ట్రీలోనే రెండు భిన్న స్వరాలు వినిపించినట్లయింది.