తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) సభ్యురాలిగా పాయకరావుపేట ఎమ్మెల్యే అనితను ప్రభుత్వం నియమించింది. అయితే, ఇదే సందర్భంలో ఆమెకి సంబంధించిన ఓ 14 సెకెన్ల వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆమె గతంలో ఓ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. ‘దేవుడి గురించి ఇంత డివోషనల్ గా చెప్తున్నాను కదా, నేను క్రిస్టియన్ ని. ఇప్పటికీ కూడా నా బ్యాగులో బైబిల్ ఉంటాది. నా కారులో బైబిల్ ఉంటాది. బైబిల్ లేకుండా బయటకి వెళ్లను. కానీ..’ అంటూ ఆమె చెప్పారు. దీంతో బోర్డు సభ్యురాలిగా ఆమెని ఎలా నియమిస్తారంటూ వివాదం రేగింది.
దీనిపై తాజాగా అనిత స్పందించారు. గతంలో తాను ఇచ్చిన ఆ ఇంటర్వ్యూ గంటకుపైగా నిడివి ఉందనీ, కొంతమందికి వారికి కావాల్సిన మాటల్ని మాత్రమే కట్ చేశారని ఆమె చెప్పారు. ఆరోజు తాను కుంకుమ పెట్టుకుని ఇంటర్వ్యూ ఇవ్వడాన్ని గమనించాలన్నారు. ఉపమాక వెంకన్న స్వామి గురించి తాను ఆ ఇంటర్వ్యూలో చెప్పాననన్నారు. తన చుట్టుపక్కల వాళ్లుగానీ, తన చుట్టాలుగానీ క్రిస్టియన్ నేపథ్యం ఉన్నవాళ్లనీ, ఓవరాల్ గా కొంతమంది ఎస్సీలు క్రిస్టియానిటీ పుచ్చుకుంటారు అన్నారు. అలాంటి పరిస్థితుల్లోంచి కూడా తాను ఉపమాక వెంకన్న స్వామిని పూజిస్తానన్నారు. ఇది ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారమని ఆరోపించారు. ఇదంతా తనపై లక్ష్యంగా జరుగుతున్నది కాదనీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ సర్కారుపైన జరుగుతున్న దాడిలో భాగమని అని పేర్కొన్నారు. ఈ వివాదానికి సంబంధించి పార్టీ ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా కట్టుబడి ఉంటానని అనిత చెప్పారు.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో తాను బైబిల్ లేనిదే బయటకి వెళ్లనని చెప్పారు. దానిపై వివరణ ఇస్తూ తన చుట్టూ ఉన్నవారు క్రిస్టియన్ నేపథ్యం ఉన్నవారనీ, ఎస్సీల్లో చాలామంది క్రిస్టియానిటీ పుచ్చుకుంటారని మాత్రమే చెప్పడం గమనార్హం! పైగా, ఈ వివాదమంతా ముఖ్యమంత్రి లక్ష్యంగా ప్రతిపక్షాలు చేస్తున్న కుట్ర అంటూ ఆమె ఆరోపించడమూ గమనించాల్సిన విషయమే. టీటీడీ బోర్డు ఛైర్మన్ గా పుట్టా సుధాకర్ యాదవ్ నియామకం తరువాత, ఆయనపై కూడా ఇలాంటి విమర్శలే వినిపించాయి. ఆయన క్రిస్టియన్ మిషనరీ సమావేశాలకు వెళ్తారని, అలాంటివారికి ఇంత కీలక పదవి ఎలా ఇస్తారంటూ వివాదం రేగిన సంగతి తెలిసిందే.