హైదరాబాద్: కాల్‌మనీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలుగుదేశం ఎమ్మెల్యే బోడె ప్రసాద్ మీడియా ముందుకొచ్చారు. కాల్‌మనీ ప్రధాన నిందితుల్లో ఒకరైన వెనిగళ్ళ శ్రీకాంత్‌తో కలిసి బ్యాంకాక్ వెళ్ళిన ప్రసాద్ ఇవాళ విజయవాడ చేరుకున్నారు. ఇవాళ ఒక టీవీ ఛానల్‌తో మాట్లాడతూ ఈ వ్యవహారంలో తనకు ఏమాత్రం సంబంధం లేదని చెప్పారు. కాల్‌మనీ వ్యాపారంలో తాను ఎలాంటి పెట్టుబడులూ పెట్టలేదని అన్నారు. దేవినేని నెహ్రూ ఆరోపణలు ఖండిస్తున్నానని చెప్పారు. నెహ్రూలా తాను హత్యలు చేసి సంపాదించలేదని అన్నారు. సోడాలు కొట్టుకునే నెహ్రూ వేలకోట్లు ఎలా సంపాదించాడో అందరికీ తెలుసని చెప్పారు. ఈ వ్యవహారం తెలియగానే శ్రీకాంత్‌ను మందలించానని తెలిపారు. తాను కష్టపడి వ్యాపారం చేసిన డబ్బుతో ప్రజాసేవ చేస్తున్నానని, ఎన్నికలకు ముందు తనకున్న 25 ఎకరాల పొలం ఇప్పుడు 2.5 ఎకరాలకు చేరిందని చెప్పారు. విదేశాలలో తన భార్యా, పిల్లలతో దిగిన ఫోటోలను కొందరు మార్ఫింగ్ చేసి విదేశాల్లో యువతులతో జల్సాలు చేస్తున్నానని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. శ్రీకాంత్‌కు డబ్బులివ్వాల్సిఉన్నా ఎగ్గొట్టేయాలని సూచించారు. కాల్‌మనీ వ్యవహారం చాలా దారుణమని, నిందితులకు శిక్షపడేదాకా తానూ పోరాడతానని బోడె ప్రసాద్ చెప్పారు. తన గెస్ట్ హౌస్‌లో సినీనటులు ఉన్నారని నెహ్రూ చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, తాను సంక్రాంతి సంబరాలు చేసినపుడు చాలామంది సినీ నటులు వచ్చిన మాట నిజమేనని తెలిపారు. శ్రీకాంత్ కాల్ మనీ వ్యాపారం చేసినట్లు తనకు తెలియదని, ఫైనాన్స్ వ్యాపారిగా మాత్రమే తెలుసని అన్నారు. అతనికి ఈ వ్యవహారంలో సంబంధమున్నట్లు తనకు విదేశాలకు వెళ్ళిన తర్వాత తెలిసిందని చెప్పారు.