తెదేపా దెందులూరు ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ చీఫ్ విప్ చింతమనేని ప్రభాకర్ మళ్ళీ వార్తలలోకి ఎక్కారు. ఈసారి కూడా మళ్ళీ తప్పు చేసినందుకే వార్తలకెక్కారు. అటవీ శాఖ అధీనంలో ఉన్న నిషేధిత ప్రాతమయిన కొల్లేరు సరస్సు మధ్యలో ఆటపాక నుండి కోమటి లంక వరకు నిన్న రాత్రి మూడు గంటల సమయంలో మట్టి రోడ్డు నిర్మించారు. దానిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన అటవీ శాఖ డిప్యూటీ రెంజర్ ఈశ్వరరావును బెదిరించి అక్కడి నుండి పంపించి వేసి రోడ్డు నిర్మాణం పూర్తి చేసారు. “కావాలంటే నా మీద పోలీసులకు పిర్యాదు చేసుకోమని” ఉచిత సలహా కూడా ఇచ్చారు.
కొల్లేరు సరస్సులో ఎటువంటి నిర్మాణాలు చేప్పట్టకూడదని సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అదే విషయం తెలియజేస్తూ అక్కడ అటవీ శాఖ ఒక బోర్డును కూడా ఏర్పాటు చేసింది. కానీ చింతమనేని ప్రభాకర్ తన అనుచరులు దగ్గరుండి సుమారు 500 లారీల మట్టితో ఆటపాక నుండి కోమటి లంక వరకు రోడ్డు నిర్మించారు. దాని కోసం అనేక ప్రోక్లేయిన్లను కూడా ఉపయోగించారు. అటవీ శాఖ అధికారులు అక్కడికి రాకుండా దారిలో ప్రోక్లేయిన్లను అడ్డుగా గోడలా నిలబెట్టించి కేవలం రెండు మూడు గంటల వ్యవధిలోనే రోడ్డు నిర్మాణం పూర్తి చేసారు. అటవీ శాఖా అధికారులు ఇక చేసేదేమీ లేక కైకలూరు పోలీసులకి పిర్యాదు చేసారు. వారు చింతమనేని ప్రభాకర్, అయన అనుచరులపై కేసు నమోదు చేసారు.
కోమటి లంకలో బినామీ పేర్లతో ఉన్న తన చేపల చెరువులకు ట్రాక్టర్లు, మినీ లారీలలో ఆహారం వగైరా తరలించేందుకే చింతమనేని రోడ్డు నిర్మించినట్లు సమాచారం. ఆ గ్రామస్తులకు ఊళ్లోకి రావడానికి సరయిన రహదారి లేకపోవడం చేతనే రోడ్డు నిర్మించినట్లు చింతమనేని చెప్పుకొంటున్నారని తెలుస్తోంది. ప్రజా ప్రతినిధిగా, ఒక భాద్యతాయుతమయిన పదవిలో ఉన్న చింతమనేని సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి నిషేధిత ప్రాంతమయిన కొల్లేరు సరసు మధ్యలో రోడ్డు నిర్మాణం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహించడంపై రాష్ట్రంలో నిషేధం ఉన్నప్పటికీ చింతమనేని చాలా నిర్భయంగా ఆ నిషేదాజ్ఞాలు ఉల్లఘించడం పరిపాటే. అలాగే ఇంతకుముందు ఒకసారి ఆయన అక్రమ ఇసుక రవాణా చేస్తున్నప్పుడు తనని అడ్డుకొన్న ముసునూరు తహసిల్దార్ వనజాక్షిని, ఆమెతో వచ్చిన రెవెన్యూ సిబ్బందిని కొట్టారు. దానిపై చాలా వివాదం చెలరేగింది. కానీ చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయననే వెనకేసుకొని వచ్చి, వనజాక్షిదే తప్పంతా అని తేల్చి చెప్పడంతో ఆయన కూడా విమర్శలు మూటగట్టుకొన్నారు. మరి ఇప్పుడూ చింతమనేని ప్రభాకర్ చేసిన ఈ పనిని కూడా ముఖ్యమంత్రి వెనకేసుకు వస్తారో లేక ఇప్పుడయినా ఆయనపై చర్యలు తీసుకొంటారో చూడాలి.