విపక్ష నేత జగన్మోన్ రెడ్డిపై ఘాటైన విమర్శలు చేశారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. ముస్లింలు జగన్ ను నమ్మి మోసపోయారన్నారు. ఆయన భాజపాతో రహస్యంగా పొత్తు పెట్టుకున్నారనీ, ఆ విషయాన్ని బహిరంగంగా ఒప్పుకోలేరని విమర్శించారు. గత ఎన్నికల్లో రాష్ట్ర ప్రయోజనాల కోసమే భాజపాతో టీడీపీ పొత్తు పెట్టుకుందన్నారు. వచ్చే ఎన్నికల్లో వైకాపాకి పాతిక సీట్లు రావడం కూడా కష్టమౌతుందని జోస్యం చెప్పారు. గుంటూరు సభలో ఉద్దేశపూర్వకంగానే అల్లరి చేసేందుకు వైకాపా ప్రయత్నించిందన్నారు.
‘తెలుగుదేశం పార్టీ అనుకుంటే… నువ్వు చేస్తున్న సంకల్ప యాత్రో, కాలక్షేప యాత్రో అడుగు కూడా ముందుకు సాగేది కాద’న్నారు. కానీ, టీడీపీకి ఆ సంస్కృతి కాదని జలీల్ చెప్పారు. జగన్ చేస్తున్న పాదయాత్రని టీడీపీ నేతలుగానీ, కార్యకర్తలుగానీ అడ్డుకున్న సందర్భాలు ఏవైనా ఉన్నాయా అని ప్రశ్నించారు? జనసేన పార్టీ గురించి మాట్లాడుతూ… పవన్ కల్యాణ్ కి ఒక్క సీటు కూడా రాదని జలీల్ జోస్యం చెప్పారు! చిరంజీవే సొంత నియోజక వర్గంలో గెలవలేకపోయారనీ, ఇక పవన్ కల్యాణ్ ని ఎవరు నమ్ముతారన్నారు.
రాబోయే ఆరేడు నెలల్లో తమకు మరిన్ని నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. కాబట్టి, కొత్తగా మంత్రి పదవి ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదని జలీల్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఏడాదిలో కొత్తగా ఒక మంత్రి వచ్చి, బాధ్యతలు స్వీకరణ కష్టమౌతుందనీ, ప్రస్తుతం ముఖ్యమంత్రే అన్నీ చూసుకోవడం వల్ల తమకు మరింత మేలు జరుగుతుందన్నారు. ఇప్పటికిప్పుడు ఇచ్చినా మంచిదేనని, ఇయ్యకపోయినా తాము బాధపడటం లేదన్నారు. అయితే, వచ్చే ఎన్నికల తరువాత తమకు డెప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని తాను ముఖ్యమంత్రిని కోరాను అన్నారు. దీంతోపాటు, ఒక మంత్రి పదవి కూడా ఇస్తే బాగుంటుందన్నారు. తెలంగాణలో కూడా ఉప ముఖ్యమంత్రి పదవిని అలాగే ఇచ్చారు కదా అన్నారు. రాష్ట్రంలో దాదాపు 60 లక్షమంది ఉన్నాం కాబట్టి, దీనిపై ఏరకంగా ముందుకెళ్తారో చూడాలన్నారు.
జలీల్ వ్యాఖ్యలతో ఒక క్లారిటీ ఏంటంటే… కొత్తగా మంత్రి పదవుల్లాంటివేవీ ఇక లేనట్టే అని! కొద్దిరోజుల కిందట ముస్లింలకు మంత్రి పదవి దక్కుతుందనే ప్రచారం జరిగింది. ఆ ఆలోచనలో టీడీపీ ఉందన్న కథనాలూ వచ్చాయి. నిజానికి, ఇప్పటికిప్పుడు కొత్తగా పదవి ఇవ్వడం వల్ల ప్రాక్టికల్ గా చేసేదేం ఉండదు. అయితే, టీడీపీ మేనిఫెస్టోలో ముస్లింలకు మంత్రి పదవి అని చేర్చాల్సి అవసరం కనిపిస్తోంది. ఇక, జలీల్ అయితే ఉప ముఖ్యమంత్రి కావాలని అడుగుతున్నారు.