జేసి బ్రదర్స్ గా ప్రజలకు సుపరిచితులయిన జేసి దివాకర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత కాలం ఆ పార్టీకి కంట్లో నలుసులాగ ఉండేవారు. గతేడాది సార్వత్రిక ఎన్నికల ముందు వారిరువురూ కాంగ్రెస్ పార్టీని వీడి తెదేపాలో చేరిన తరువాత కూడా తమ వైఖరిని ఏమాత్రం మార్చుకోలేదు. వారిప్పుడు తెలుగుదేశం పార్టీకి, ప్రభుత్వానికి కంట్లో నలుసులా తయారయ్యారు. వారిరువురి మాటలతో, రాజకీయ వ్యాఖ్యానాలతో అధికార తెదేపాకు చాలా ఇబ్బందికర పరిస్థితులు సృష్టిస్తున్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి మళ్ళీ నిన్న వివాదాస్పద ప్రకటన చేసారు.
ఆయన నిన్న మీడియాతో మాట్లాడుతూ, “నా నియోజక వర్గం అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. కనుక నేను కాంట్రాక్టర్ల దగ్గర నుంచి లంచం తీసుకొని దానితో నా నియోజక వర్గం అభివృద్ధి చేసుకొంటున్నాను. వారి నుండి లంచం డిడి రూపంలో తీసుకొంటూ పూర్తి పారదర్శకత పాటిస్తున్నాను. దానికి ఆడిట్ లెక్కలు కూడా ఉన్నాయి. ఎవరయినా ఎప్పుడయినా వచ్చి తణికీ చేసుకోవచ్చును. నీను గనుక ఆ లంచం దాబుని నా నియోజక వర్గ అభివృద్ధికి వినియోగిస్తున్నాను మరోకరయితే దానిని జేబులో వేసుకొనుండేవారు. మనం కొన్నయినా మంచి పనులు చేసినప్పుడే మనం చనిపోయిన తరువాత కూడా ప్రజలు మనల్ని కనీసం కొన్ని రోజులయినా గుర్తుంచుకొంటారు. అందుకే ఈ లంచం డబ్బుని ఈ విధంగా సద్వినియోగం చేస్తున్నాను,” అని తెలిపారు.