తెదేపా ఎమ్మెల్యే జేసి ప్రభాకర్ రెడ్డి మొన్న మీడియాతో మాట్లాడుతూ “నా తాడిపత్రి నియోజక వర్గాన్ని అభివృద్ధి చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద డబ్బులు లేవు కనుక నేను కాంట్రాక్టర్ల వద్ద నుంచి పూర్తి పారదర్శకత్వం పాటిస్తూ లంచాలు తీసుకొని అభివృద్ధి చేసుకొంటున్నాను. నేను వారి నుంచి డీడీల రూపంలోనే లంచాలు స్వీకరిస్తూ వాటికి ఆడిటింగ్ కూడా చేయిస్తున్నాను. నేను చనిపోయిన తరువాత కూడా ప్రజలు నన్ను కొన్ని రోజులు గుర్తుపెట్టుకోవాలంటే కొన్నయినా మంచిపనులు చేయాలని భావించి కాంట్రాక్టర్ల వద్ద నుంచి లంచాలు తీసుకొని తాడిపత్రి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకొంటున్నాను,” అని తెలిపారు.
ఊహించినట్లే ప్రతిపక్ష పార్టీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై, జేసీ ప్రభాకర్ రెడ్డిపై విమర్శలు గుప్పించాయి. పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి మాట్లాడుతూ తెదేపా ప్రభుత్వంలో అవినీతి ఏ స్థాయికి చేరుకొందో ప్రభాకర్ రెడ్డి మాటలు తెలియజేస్తున్నాయి. అధికార పార్టీకి చెందిన ఒక ప్రజా ప్రతినిధి తాను కాంట్రాక్టర్ల దగ్గర నుంచి లంచాలు తీసుకొంతున్నానని బహిరంగంగా ప్రకటించడమే కాకుండా దానికి లెక్కలు కూడా నిర్వహిస్తున్నాని నిసిగ్గుగా చెప్పుకొంటున్నారు. చంద్రబాబు పట్టిసీమ ప్రాజెక్టులో లంచాలు తీసుకుని ‘లీగలైజ్’ చేస్తుంటే, యాధారాజ….అన్నట్లు ప్రభాకరరెడ్డి తాడిపత్రిలో లంచాలను చట్టబద్దం చేస్తున్నట్లున్నారు. దీనికి ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతుంది? ప్రభాకర్ రెడ్డిపై ఏమి చర్యలు తీసుకుంటుందని? రఘువీరా రెడ్డి ప్రశ్నించారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు లంచాలు తీసుకోవడాన్ని చట్టబద్దం చేసిందా? అని ప్రశ్నించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో లంచాల ప్రభుత్వం నడుస్తోందని ఆయన ఎద్దేవా చేసారు.
రఘువీరా రెడ్డి చేసిన ఈ ఘాటు విమర్శలతో ప్రభాకర్ రెడ్డి కొంచెం కంగారు పడినట్లున్నారు. ఆయన నిన్న తను చేసిన ప్రకటనకి చిన్న సవరణ ఇచ్చారు. కాంట్రాక్టర్ల వద్ద నుంచి నేను తీసుకొంతున్నవి లంచాలు కాదు విరాళాలు. నియోజక వర్గ అభివృద్ధికి వారు అందిస్తున్న విరాళాలకు లెక్కలు ఉన్నాయని చెపితే న మాటలను మీడియా వక్రీకరించింది,” అని అన్నారు.