వరంగల్ ఉపఎన్నికలు..ఆ తరువాత ఎమ్మెల్సీ ఎన్నికలు…మళ్ళీ గ్రేటర్ ఎన్నికలలో వరుసగా ప్రతిపక్ష పార్టీలు ఘోర పరాజయం పాలయ్యాయి. త్వరలో జరుగబోయే నారాయణఖేడ్ ఉప ఎన్నికలలో విజయం సాధించడం కోసం తెరాస చాలా గట్టి కసరత్తు చేసింది కనుక బహుశః అక్కడ కూడా తెరాస ప్రతిపక్షాలను పూర్తిగా తుడిచిపెట్టేయవచ్చును. ఇంతవరకు గ్రేటర్ హైదరాబాద్ లోనయినా ప్రతిపక్షాలకు మంచిపట్టు ఉందని అందరూ భావించేవారు. ఇప్పుడు అక్కడా ఓడిపోయింది. తెరాస ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షాలు ఎంతగా ఎత్తి చూపుతున్నప్పటికీ, ప్రతీ ఎన్నికలలో ప్రజలు దానికే ఓట్లువేసి గెలిపిస్తుండటంతో ప్రతిపక్ష పార్టీల నేతలు, కార్యకర్తలు చాలా డీలా పడిపోతున్నారు.
గ్రేటర్ ఎన్నికల తరువాత మళ్ళీ తెరాసలోకి వలసలు మొదలవుతాయని ఊహించినట్లే కుత్బుల్లాపూర్ తెదేపా ఎమ్మెల్యే కెపి.వివేకానంద ఈరోజు తెరాసలో చేరబోతున్నట్లు తెలుస్తోంది. ఈరోజు ఉదయం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో ఆయన తెరాసలో చేరవచ్చునని తాజా సమాచారం. గ్రేటర్ ఎన్నికలలో ఆయన నియోజకవర్గంలో అన్ని డివిజన్లను తెరాస గెలుచుకోవడంతో అది ఇప్పుడు తెరాస అధీనంలోకి వెళ్ళిపోయినట్లు అయింది. కనుక తాను ఇంకా తెదేపాలో కొనసాగినట్లయితే, తన నియోజక వర్గంపై పూర్తిగా పట్టు కోల్పోతాననే భయంతోనే ఆయన తెరాసలోకి మారబోతున్నట్లు తెలుస్తోంది. అదే కారణం చేత మిగిలిన నియోజకవర్గాలలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, నేతలు కూడా తెరాసలోకి మారే ఆలోచన చేయవచ్చును. తరువాత రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ వంతు కావచ్చును.