సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య.. టీఆర్ఎస్లో చేరాలని నిర్ణయించుకోవడంతో.. ఇక అందరి దృష్టి… తెలంగాణ టీడీపీకి మిగిలిన ఉన్న ఒక్కరిపై పడింది. ఆ ఒక్కరే… అశ్వారావు పేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు. ఆయనపై కూడా.. టీఆర్ఎస్లో చేరాలని తీవ్ర స్థాయిలో ఒత్తిడి వచ్చింది. కానీ ఆయన తాను టీడీపీలోనే ఉంటానని చెప్పినట్లు ప్రకటించారు. తెలంగాణలో టీడీపీని ఆదరించే పరిస్థితి లేదని… సండ్ర నేరుగా చెబుతూ.. పార్టీకి రాజీనామా చేశారు. మరి ఏ ధైర్యంతో.. మెచ్చా నాగేశ్వరరావు.. టీడీపీలోనే ఉంటారనంటున్నారు..? అంటే.. దీనికి ఆయన దగ్గర రెడీగా సమాధానం ఉంది. ఆ దైర్యం పేరు… జూ.ఎన్టీఆర్. తెలంగాణ తెలుగుదేశం పార్టీని జూనియర్ ఎన్టీఆర్ నడిపిస్తారని.. వచ్చే ఎన్నికల్లోపు.. అద్భుతం జరుగుతుందని.. ఆయన ఆశ పడుతున్నారు.
2014 ఎన్నికల్లోనూ టీడీపీ తరపున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయిన మెచ్చా నాగేశ్వరరావు.. ఆ తర్వాత తుమ్మల లాంటి దిగ్గజ నేతలు.. పార్టీకి గుడ్ బై చెప్పినప్పటికీ… ఆయన కదలలేదు. పొత్తులో భాగంగా.. అశ్వారావు పేట సీటు వస్తుందో రాదో అని టెన్షన్ కూడా పడలేదు. ఆయన స్థానాన్ని పట్టుబట్టి టీడీపీ తీసుకుంది. సునాయాసంగా గెలిచారు కూడా. అందుకే.. రెండేళ్లలో టీడీపీని బతికించుకుంటామని ఆశతో ఉన్నారు. రెండేళ్ల తర్వాత డైమండ్ లాంటి లీడర్ వస్తారని చెబుతున్నారు. ” జూనియర్ ఎన్టీఆర్ రెండేళ్ల తర్వాత రాజకీయాల్లోకి వస్తానని చంద్రబాబుకు చెప్పారట. జూనియర్ ఎన్టీఆర్ వస్తే తెలంగాణలో పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఆరంగేట్రంపై చంద్రబాబు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. కేడర్‌ను ధైర్యంగా ఉండమని చెప్పారు…” అని మెచ్చా నాగేశ్వరరావు మీడియా ముందు చెబుతున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తారో రారో అన్నదానిపై ఇంత వరకు క్లారిటీ లేదు. కానీ.. తెలుగుదేశం పార్టీకి చెందినంత వరకు మాత్రం.. ఆయన దూరదూరంగానే ఉంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. ఆయనకు దేవుడిచ్చిన అన్నగా భావించే కొడాలి నాని, పిల్లనిచ్చిన మామ నార్నె శ్రీనివాసరావు.. జగన్ పంచన ఉన్నారు. ఇప్పుడు.. మెచ్చా నాగేశ్వరరావు జూనియర్ ఎన్టీఆర్ తెలంగాణ రాజకీయాల్లోకి వస్తారని చెప్పడం.. కచ్చితంగా హాట్ టాపిక్ అయ్యే అంశమే..!