ఆంధ్ర ప్రదేశ్‌లో మంత్రులు తెలుగుదేశం ప్రజా ప్రతినిధులు కొంతకాలం పాటు రాజధాని గురించే మాట్లాడుతుండేవారు. ప్రపంచ స్థాయి రాజధాని కట్టిచూపిస్తామని సవాళ్లు చేసేవారు. కొంతకాలం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ టాపిక్ మానేసి ఇతర విషయాలు మాట్లాడారు. ఇటీవల మళ్లీ తరలింపు, ఉద్యోగుల రాక, భవనాలు అద్దెకు తీసుకోవడం వంటి విషయాలపై చర్చ పెరిగింది. ఒక గ్రామంలో రైతులకు ప్లాట్టు కేటాయించారు కూడా. ఇదే సమయంలో అమరావతిలో నిర్మాణాల కోసం అసెండాస్ సింగ్‌బ్రిడ్జి సెంబ్‌కార్ప్ కన్సార్టియంకు భూములు అప్పగించనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇవన్నీ ఏ షరతుల ప్రకారం నడుస్తున్నాయి అంతిమంగా ఎలా పరిణమిస్తాయనే దానిపై పాలకపక్షంలోనే స్పష్టత లేదు. అందుకే రాజధాని గురించి మాట్లాడాలంటే తటపటాయిస్తున్నారు. ఇటీవల ఒక ప్రముఖ ఛానల్ కో ఆర్డినేటర్ ఈ అంశంపై చర్చ కోసం తెలుగుదేశం ఎంఎల్ఎకు ఫోన్ చేశారు. మొదట సానుకూలంగా స్పందించినా విషయం రాజధాని అని తెలుసుకుని సదరు ఎంఎల్ఎ వెంటనే వెనక్కు తగ్గారు.అన్నా అమరావతి తప్ప ఏదైనా మాట్లాడతా. ఆ విషయం మా మంత్రి నారాయణ మాత్రమే చెప్పగలరు అంటూ తప్పుకున్నారట ఆ ఎంఎల్ఎ.ఇంతకూ ఆయన రాజధాని ప్రాంతానికి చెందిన వారేగాక కొన్నికమిటీలలోనూ వుండటం విశేషం. అంటే చంద్రబాబు ప్రభుత్వ వ్యవహారం ఎంత గజిబిజిగా నడుస్తుందో తెలుస్తుంది.