విశాఖ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వైసీపీ గూటికి చేరారు. వైసీపీ సిద్దాంతం ప్రకారం.. ఆయన కండువా కప్పుకోలేదు కానీ.. ఆయన కుమారుడికి కప్పించారు. దాంతో ఆయన కూడా అనధికారికంగా వైసీపీ సభ్యుడైపోయారు. ఇప్పటికే టీడీపీ తరపున గెలిచిన మద్దాల గిరి, వల్లభనేని వంశీ, కరణం బలరాం.. వైసీపీలో అనధికారికంగా చేరి.. టీడీపీపై విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు వీరికి వాసుపల్లి గణేష్ తోడు కానున్నారు. మొత్తంగా నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీకి దూరం కాగా.. ఇంకా పందొమ్మిది మంది మాత్రమే మిగిలారు. వీరిలో గంటా లాంటి వాళ్లు ఇంకా ఉన్నారు. వాసుపల్లి గణేష్ వైసీపీలో చేరడంలో విజయసాయిరెడ్డి కీలకంగా వ్యవహరించారు. ఆయనే.. జగన్ వద్దకు వాసుపల్లి గణేష్‌ను తీసుకెళ్లారు.
విశాఖ టీడీపీ నేతల్ని వైసీపీలోకి చేర్చే ప్రక్రియలో విజయసాయిరెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. గంటా శ్రీనిసరావును ఆయన ప్రమేయం లేకుండా పార్టీలో చేర్చకుంటున్నారన్న ప్రచారం జరిగినప్పుడు ఆయన క్వారంటైన్లో ఉన్నారు. తర్వాత పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకున్నారు. గంటా వైసీపీలోకి వస్తే.. మొత్తం పార్టీ డిస్టర్బ్ అవుతుందన్న అభిప్రాయాన్ని కల్పించి.. ఆయన రాకను అడ్డుకోగలిగారు. అదే సమయంలో.. పార్టీ బలోపేతం కోసం.. మరో ఎమ్మెల్యేను పార్టీలోకి తీసుకొచ్చేందుకు జగన్ ను ఒప్పించారు. వాసుపల్లి గణేష్‌కు కొన్ని వ్యాపారాలు.. విద్యాసంస్థలు ఉన్నాయి. ఆ వైపు నుంచి విజయసాయి ప్రయత్నించడంతో వాసుపల్లి మెత్తబడిపోయారు.
వాసుపల్లి రెండో సారి టీడీపీ తరపున గెలిచారు. ఆయన మొన్నటి వరకూ చురుగ్గానే ఉన్నారు. అయితే ఒత్తిళ్లు భరించలేక… వైసీపీ గూటికి చేరారు. మరో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలని టీడీపీకి దూరం చేస్తే.. తెలుగుదేశం పార్టీ అధినేతకు ప్రధాన ప్రతిపక్ష హోదాను.. దూరం చేయవచ్చని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఆ మేరకు కొంత మంది ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లుగా చెబుతున్నారు. అయితే.. సభలో మరో పార్టీ లేకపోవడంతో… ప్రతిపక్ష పార్టీ అయినా.. ప్రధాన ప్రతిపక్షం అయినా టీడీపీనే ఉంటుంది. పరిస్థితుల్ని బట్టి.. గడ్డు పరిస్థితులు ఏర్పడినప్పడల్లా.. ఒక్కో టీడీపీ ఎమ్మెల్యేలను లాగానే ప్లాన్ వైసీపీ అమలు చేస్తోంది.