ఇరవై మంది టీడీపీ ఎమ్మెల్యేలు నాతో టచ్‌లో ఉన్నారని అప్పట్లో రాజ్ భవన్ ముందు…చేసిన చాలెంజ్‌ను.. మరోసారి అసెంబ్లీలో గుర్తుకు వచ్చేలా చేశారు జగన్మోహన్ రెడ్డి. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు తనతో ఎంతమంది టచ్ లో ఉన్నారో చెప్పమంటారా అంటూ అసెంబ్లీలో వేలు చూపిస్తూ.. చేసిన వ్యాఖ్యలు.. అటు శాసనసభలో, ఇటు లాబీల్లో తీవ్ర కలకలం రేకెత్తించాయి. తెలుగుదేశం ఎమ్మెల్యేలు మూకుమ్మడిగా జగన్ వ్యాఖ్యలను సభలోనే ఎద్దేవా చేశారు. అయితే.. అంతర్గతంగా మాత్రం.. కలకలం రేపింది.
ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో తెలుగుదేశం ఎమ్మెల్యేలు కొంతమంది వైసీపీ వైపు చూస్తున్నారని ప్రచారం జరిగింది. ఆరు నుంచి ఏడుగురు వైసీపీలోకి వెళ్తారని కూడా వారి పేర్లతో సహా సోషల్ మీడియా కోడై కూసింది. అప్పట్లో ఈ ప్రచారం జరిగినప్పటికీ, ఆ తర్వాత నిలిచిపోయింది. ఎవరైన తమ పార్టీలో చేరాలంటే వారు రాజీనామా చేయాల్సిందేనని, తిరిగి ఎన్నికైన తర్వాతనే పార్టీలోకి తీసుకుంటానని జగన్ స్పష్టం చేయడంతో వీరు ఆగిపోయారని కూడా అప్పట్లో చెప్పుకున్నారు. ఆ ప్రచారానికి తగ్గట్టుగానే అసెంబ్లీలో జగన్ తాను ఫిరాయింపుల చట్టాన్ని ఉల్లంఘించనని… వైసీపీ ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇదే సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నానని స్పష్టం చేశారు. ఎవరైనా తమ పార్టీలోకి రావాలన్నా, తాము తీసుకోవాలన్నా వారు ఆ పార్టీకి, పదవులకు రాజీనామా చేసి రావాల్సిందేనని జగన్ స్పష్టం చేశారు.
ఆ తర్వాత లాబీల్లో దీనిపై చర్చ జరిగింది. ఉత్తరాంధ్రకు చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు వైసీపీలోకి వస్తామని చెప్పారని వైసీపీ ఎమ్మెల్యేలు కొంతమంది అసెంబ్లీ లాబీల్లో విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారం తెలుగుదేశం ఎమ్మెల్యేల వరకు వెళ్లింది. వారు మమ్మల్ని బద్నామ్ చేసేందుకు ఇటువంటి ప్రచారం చేస్తున్నారని తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఆరోపించారు. 151 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీకుంటే, తాము వెళ్లి అక్కడ ఏం చేస్తామని కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలు ప్రశ్నించారు. ఇలా అసెంబ్లీ లాబీల్లో తెలుగుదేశం, వైసీపీ వర్గాలు ఒకరిపై ఒకరు మీడియా వద్ద విస్తృతంగా ప్రచారం కూడా చేశారు.