తెరాసలో చేరిన 10 మంది తెదేపా ఎమ్మెల్యేలు, ఈరోజు తెరాసలో చేరబోతున్న మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా తెరాస సభ్యులుగా గుర్తిస్తున్నట్లు శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి నిర్ణయం తీసుకొన్నట్లుగా శాసనసభ కార్యదర్శి డా. రాజా సాదారాం నిన్న ప్రకటించారు. తెదేపా ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, అరికెపూడి గాంధీ నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలిసి ఈరోజు తాము తెరాసలో చేరుతామని తెలిపారు. అదే విషయం స్పీకర్ మధుసూదనాచారికి కూడా తెలియజేసి తమను కూడా తెరాస సభ్యులుగా గురించాలని విజ్ఞప్తి చేయడంతో దానికి ఆయన అంగీకరించారు.
తమను తెరాస సభ్యులుగా గుర్తించాలని కోరుతూ ఫిబ్రవరి 11న ఎమ్మెల్యేలు అందరూ సంతకాలు చేసిన ఒక లేఖను స్పీకర్ కి అందజేశారు. దానిపై నిపుణులతో చర్చించిన తరువాత ఆయన నిన్న ఆమోదించారు. తెలంగాణాలో ఉన్న తెదేపా ఎమ్మెల్యేలలో 2/3వంతు మంది సభ్యులు తెరాసలో చేరినందున వారికి ఇక పార్టీ ఫిరాయింపు చట్టం వర్తించదని వారు అభిప్రాయపడుతున్నారు. వారందరినీ తెరాస అనుబంధ సభ్యులుగా గుర్తించి, తెరాస సభ్యులతో పాటు శాసనసభలో సీట్లు కేటాయిస్తారు. వారందరినీ తెరాస సభ్యులుగా గుర్తించబడ్డారు కనుక ఇక వారిపై అనర్హత వేటు వేయనవసరం లేదు కనుక ఉప ఎన్నికలకి వెళ్ళవలసిన అవసరం కూడా ఉండకపోవచ్చును.
తెరాస సభ్యులుగా గుర్తించబడిన ఎమ్మెల్యేలు: తలసాని శ్రీనివాస్ యాదవ్, తీగల కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు, ప్రకాశ్‌గౌడ్, చల్లా ధర్మారెడ్డి, జి.సాయన్న, మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, కేపీ వివేకానంద, ఎస్.రాజేందర్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాగంటి గోపీనాథ్ మరియు అరికెపూడి గాంధీ.