తెలంగాణా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రాజీనామా వ్యవహారం రావణకాష్టంలాగ ఇంకా రగులుతూనే ఉంది. తెదేపా తెలంగాణా శాసనసభ పక్ష నేత ఎర్రబెల్లి దయాకర్ రావు నేతృత్వంలో తెదేపా ఎమ్మెల్యేలు నిన్న స్పీకర్ మధుసూధనాచారిని కలిసి తలసాని రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరుతూ ఒక విజ్ఞప్తి పత్రం ఇచ్చారు. కానీ ఆయన సానుకూలంగా స్పందించకపోవడంతో వారు ఆయన ఛాంబర్ లోనే ధర్నాకు కూర్చొన్నారు. వారు ధర్నా చేస్తుండగానే ఆయన అక్కడి నుండి బయటకు వెళ్ళిపోయారు. కాసేపు తరువాత పోలీసులు వచ్చి వారిని అక్కడి నుండి తరలించి ఆదర్శ్ నగర్, ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద విడిచిపెట్టారు. తాము మళ్ళీ మరొకమారు దీని కోసం గవర్నరుని కలిసి ఆయనకి వినతి పత్రం ఇస్తామని తెదేపా ఎమ్మెల్యేలు తెలిపారు.
తలసాని యాదవ్ తెదేపాకి రాజీనామా చేసి తెరాసలో చేరే ముందు తను నైతిక విలువలకు కట్టుబడి తన ఎమ్మల్యే పదవికి కూడా రాజీనామా చేసినట్లు చాలా గొప్పగా ప్రకటించుకొన్నారు. కానీ నేటికీ ఆయన రాజీనామా ఆమోదింపజేసుకోలేదు కనుక నేటికీ అయన తెదేపా ఎమ్మెల్యేగానే కొనసాగుతున్నారు. తెరాస మంత్రిగా ఉన్న ఆయన తెదేపా ఎమ్మెల్యేగా కొనసాగడం ఏవిధంగా నైతికత అవుతుంది? అని వారు ప్రశ్నిస్తున్నారు. తాము ఇంతవరకు స్పీకర్ కి ఏడుసార్లు, గవర్నర్ కి ఐదుసార్లు దీనికోసం విజ్ఞప్తి పత్రాలు అందజేశామని కానీ ఇద్దరూ కూడా దీనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని వారు తెలిపారు. దీనికోసమే గవర్నర్ అపాయింట్ మెంట్ కోరితే గవర్నర్ తమకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు.
దీనిపై తెదేపా నేతలు హైకోర్టుకి కూడా వెళ్ళారు. కానీ హైకోర్టు ఇచ్చిన నోటీసుని తీసుకోవడానికి స్పీకర్ నిరాకరించడంతో హైకోర్టు కూడా ఏమీ చేయలేక చేతులు ఎత్తేసింది. ఈవిధంగా హైకోర్టు, గవర్నర్, స్పీకర్, ముఖ్యమంత్రి ఎవరూ ఈ తప్పును సరిదిద్దకపోవడం చాలా విస్మయం కలిగిస్తోంది. తెలంగాణాలో ఆంధ్రజ్యోతి, టీవీ-9 చానల్స్ పై తెలంగాణా ప్రభుత్వం అప్రకటిత నిషేధం విధించినప్పుడు కూడా హైకోర్టు కేంద్రప్రభుత్వం కూడా ఆ తప్పును సవరించలేకపోయాయి. ఇటువంటివాటిని ఉపేక్షిస్తూపోతే చివరికి అవి దుస్సంప్రాదాయంగా మారి వాటినే అందరూ అమలుచేయడం మొదలుపెట్టవచ్చును. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆరోగ్యకరమయిన లక్షణం కాదు.