ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వరుసగా మూడో రోజు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై సస్పెన్,న్ వేటు వేశారు. పోలవరం అంశంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూండగా… టీడీపీ సభ్యులు అడ్డుకున్నారని.. సభ్యులను సస్పెండ్ చేయాలని మంత్రి బుగ్గన తీర్మానం పెట్టారు. వెంటనే.. ఆమోదించిన స్పీకర్ తొమ్మిది మందిపై ఒక్క రోజు సస్పెన్షన్ వేటు వేశారు. మొత్తం ఐదు రోజులు సమావేశాలు జరగ్గా.. తొలి రోజు.. తీవ్రమైన వాదోపవాదాలు జరిగాయి. పంటల బీమా ప్రీమియంపై ఏపీ సర్కార్ ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కోవడంతో.. టీడీపీ సభ్యులందర్నీ సస్పెండ్ చేశారు. నిన్న టిడ్కో ఇళ్ల మీద జరిగిన చర్చలోనూ… టీడీపీ సభ్యులను సస్పెండ్ చేశారు. ఇవాళ పోలవరం అంశంపై వాదోపవదాలు జరిగాయి.
చంద్రబాబు హయాంలో అసలు పనులేమీ జరగలేదని చెబుతూండటంతో.. ప్రభుత్వ నివేదికల్ని బయట పెట్టాలని టీడీపీ సభ్యులు అనుకున్నారు. అయితే.. జగన్ ప్రసంగానికి అడ్డు తగిలారంటూ.. సస్పెండ్ చేసేశారు. విశేషం ఏమిటంటే… టీడీపీ సభ్యులను సస్పెండ్ చేయాలన్న సూచనలు ప్రతీ సారి ముఖ్యమంత్రి జగన్ నేరుగా చేస్తున్నారు. అదీ కూడా ఆయన స్పీకర్ ను ఆదేశిస్తున్నట్లుగా చెబుతున్నారు. పది నిమిషాల్లో ఎవరి సీట్లలో వారు కూర్చోకపోతే.. సస్పెండ్ చేసి.. మార్షల్స్ తో ఈడ్చి పడేయాలని సలహాలిస్తున్నారు. దాని ప్రకారం.. అసెంబ్లీ వ్యవహారాల మంత్రి తీర్మానం పెడుతున్నారు.
సాధారణంగా సభ్యులను సస్పెండ్ చేస్తే.. ఏకపక్షంగా ప్రభుత్వం తన వాదన వినిపించుకోగలుగుతుంది కానీ.. నిజాలు బయటకు రావు. ప్రతిపక్షానికి కూడా.. అవకాశం ఇస్తేనే విషయాలు బయటకు వస్తాయి. కానీ కీలకమైన అంశాల్లో ప్రతిపక్షాన్ని సస్పెండ్ చేసి.. ప్రభుత్వం అసెంబ్లీలో ప్రసంగాలు కొనసాగించేస్తోంది.