ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వరుసగా నాలుగో రోజు కూడా టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేసి సభను నిర్వహించారు. రాష్ట్రంలో అమూల్ మిల్క్ ప్రాజెక్ట్ అంశంపై చర్చ జరుగుతున్నప్పుడు.. తమకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. అయితే.. అవకాశం రాకపోవడంతో పోడియంను చుట్టుముట్టారు. చివరికి వారందర్నీ స్పీకర్ సస్పెండ్ చేశారు. అంతకు ముందు సభలో గందరగోళం ఏర్పడింది. ప్రభుత్వంపై దూకుడుగా విమర్శలు చేస్తున్న నిమ్మల రామానాయుడు వంటి వారిపై వైసీపీ ఎమ్మెల్యేలు దూసుకెళ్లారు. నిమ్మలకు ఇతర టీడీపీ ఎమ్మెల్యేలు రక్షణగా నిలబడాల్సి వచ్చింది. మొదటి రోజు నుంచి ఏదో ఓ సందర్భంలో టీడీపీ సభ్యుల్ని బయటకు పంపుతూనే ఉన్నారు. ఆ తర్వాత చర్చలు.. బిల్లులు పాస్ చేస్తున్నారు.
ప్రతిపక్ష పార్టీకి ప్రభుత్వ తప్పు ఒప్పుల్ని చెప్పే అవకాశాన్ని ఇవ్వడం లేదు. అతి కష్టం మీద ఎవరికైనా అవకాశం ఇస్తే.. మాటి మాటికి కలుగచేసుకోవడానికి వైసీపీ సభ్యులు సిద్ధమవుతున్నారు. స్పీకర్ కూడా.. అధికార పక్షం నుంచి ఎవరు అడిగినా.. ప్రతిపక్షం మాట్లాడుతున్న వారికి బ్రేక్ ఇచ్చి వారికి చాన్సిస్తున్నారు. సాధారణంగా స్పీకర్ స్థానంలో ఉన్న ప్రభుత్వం ప్రకటన చేస్తున్నప్పుడు.. స్పందించడానికి తప్పులు చెప్పడానికి.. ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపడానికి ప్రతిపక్షాలకు ఎక్కువ చాన్సిస్తారు. కానీ ఇక్కడ ప్రతిపక్షం మాట్లాడుతూంటే.. ఎదురుదాడి చేయడానికి అధికారపక్షానికి అవకాశం ఇస్తున్నారు. దీంతో ప్రతిపక్ష వాయిస్ అసలు బయటకు రావడం లేదు.
శాసనసభ సమావేశాలు చూపించే విషయంలో ప్రతిపక్ష సభ్యులకు చోటు ఉండటం లేదు. తప్పనిసరిగా చూపించాల్సి వచ్చినప్పుడు మాత్రమే టీడీపీ సభ్యులు కనబడుతున్నారు. లేకపోతే వారు సభలో ఉన్నారో లేరో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. కవరేజీకి కూడా.. ప్రభుత్వ వ్యతిరేకం అనుకున్న చానళ్లను రానివ్వడం లేదు. దీంతో అసలు ప్రతిపక్షం గొంతు పూర్తిగా నొక్కేసినట్లయింది. స్పీకర్ కూడా.. విపక్ష సభ్యులతో కలిసిపోయినట్లుగా పట్టుమని పదిహేను మంది లేని విపక్ష సభ్యులపై విరుచుకుపడుతున్నారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో విపక్ష సభ్యులు పడిపోతున్నారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు టీడీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయమంటే.. అప్పుడు అసెంబ్లీ వ్యవహారాల మంత్రి బుగ్గన తీర్మానం చేయడానికి రెడీ అవుతున్నారు. ఎవరికి మాట్లాడేందుకు చాన్సివ్వాలనుకున్నా … కింద వైపు నుంచి సూచనలు వస్తేనే… స్పీకర్ చైర్లో ఉన్న వారు ఇస్తున్నారు. మొదటి రోజు..చంద్రబాబుకు డిప్యూటీ స్పీకర్ మైక్ ఇవ్వడంతో జగన్ ఫైరయ్యారు. ఆ తర్వాత స్పీకర్ చైర్లో కూర్చున్న వారు అసలు ప్రతిపక్షాన్ని పట్టించుకోవడం లేదు.