కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన లీకులు ఇప్పుడు ఏపీలో కలకలం సృష్టిస్తున్నాయి. ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని కేంద్రం తెగేసి చెప్పినట్టు కథనాలు వస్తున్న నేపథ్యంలో అధికార పార్టీలో తీవ్ర చర్చ మొదలైంది. తాజా ప్రకటనపై టీడీఎల్పీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చర్చించారు. కేంద్రం ఇచ్చిన సంకేతాలపై ఎమ్మెల్యే అభిప్రాయాలు తెలుసుకున్నారు. భాజపా తీరు ఇలా దారుణంగా ఎందుకు మారుతోందో అర్థం కావడం లేదంటూ ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అయినాసరే, కేంద్రంపై మరింతగా ఒత్తిడి పెంచే ప్రయత్నం చెయ్యాలనీ, ప్రయోజనాల రాబట్టుకునే దిశగా పోరాటం ఆపొద్దని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఈ సమావేశంలో భాజపాతో పొత్తు ఇప్పుడే తెంచుకోవాలా వద్దా అనే అంశంపై ప్రముఖంగా చర్చ జరిగింది. ఓ ఆరుగురు ఎమ్మెల్యేలు తప్ప.. అందరూ పొత్తు తెంచేసుకుందామనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి ముందు వ్యక్తం చేసినట్టు సమాచారం. ఇంత జరిగాక కూడా ఇంకా ఆలోచించాల్సిన అవసరం లేదనీ, మిత్రధర్మం పేరుతో ఇన్నాళ్లు ఆగింది చాలని మెజారిటీ ఎమ్మెల్యేలు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే, ఇప్పటికిప్పుడు పొత్తు తెంచుకుంటే రాష్ట్రానికి కొన్ని ఇబ్బందులు వస్తాయనే అభిప్రాయం చంద్రబాబు వ్యక్తం చేశారు. అయినా సరే, ఇబ్బందులు వస్తే పడదాం, అంతేగానీ పొత్తు మాత్రం ఇక వద్దనే అభిప్రాయమే ఎమ్మెల్యేలు వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో చంద్రబాబు మాట్లాడుతూ.. భాజపా వైఖరిని ఇన్నాళ్లూ భరించడానికి కారణం… కేంద్రం నుంచి రావాల్సినవి చాలా ఉన్నాయనీ, ఇంకోపక్క పోలవరం నిధులు ఆగిపోతాయేమో అనే ఆలోచనతోనే వేచి చూశానంటూ అభిప్రాయపడ్డారు.
మరో రెండ్రోజుల్లో తెలుగుదేశం నుంచి కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉందన్నది మాత్రం స్పష్టంగా తెలుస్తోంది. ఏపీలో భాజపాతో పొత్తు కొనసాగించడం అనేది ఇప్పుడు టీడీపీకిగానీ, భవిష్యత్తులో మరో పార్టీకైనాగానీ ఆత్మహత్యాసాదృశం అనడంలో సందేహం లేదు. ఆంధ్రా ప్రజల మనోభావాలను ఇంత దారుణంగా కించపరిచిన కేంద్ర ప్రభుత్వాలు గతంలో లేవు. రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రులను మనోభావాలను కాంగ్రెస్ పరిగణనలోకి తీసుకోలేదు. మరీ భాజపా స్థాయిలో అత్యంత అవమానకరంగా, నిర్లక్ష్యపూరితంగా, హేళనా దృక్పథంతో వ్యవహరించలేదనే చెప్పాలి. అయితే, ప్రస్తుతం ఏపీలో ప్రజాభిప్రాయమూ, ప్రజా ప్రతినిధుల అభిప్రాయమూ భాజపాతో టీడీపీ పొత్తు తెంచేసుకోవాలనే ఉంది. కానీ, అదే నిర్ణయం వెంటనే తీసేసుకుంటే కేంద్రం నుంచి రావాల్సినవన్నీ ఆగిపోతాయనే ఆందోళన చంద్రబాబులో ఉన్నట్టు కనిపిస్తోంది. ఇబ్బందులకైనా సిద్ధమని నేతలే అంటున్నారు కాబట్టి, పొత్తు తెంచుకునే దిశగానే టీడీపీ నిర్ణయం ఉంటుందనే అభిప్రాయమే కాస్త బలంగా వినిపిస్తోంది.