ఏపీ రాజకీయాల్లో ఎమ్మెల్యేల భాషను కూడా సంస్కరించాలని చంద్రబాబు నిర్ణయించారు. వైసీపీ హయాంలో అధికారం ఉందని ఆ పార్టీ నేతలు పేట్రేగిపోయినట్లుగా ఒక్కరు కూడా గీత దాటకూడదని చంద్రబాబు హెచ్చరించారు. అసెంబ్లీలో ఎమ్మెల్యేల శిక్షణా కార్యక్రమాలను చంద్రబాబు ప్రారంభించి మాట్లాడారు. ఎమ్మెల్యేలు ఎట్టి పరిస్థితుల్లోనూ తమ ప్రసంగాల్లో బూతులు మాట్లాడకూడదని స్పష్టం చేశారు.
శాసనసభలోనే కాదు ప్రజల్లో మాట్లాడే సందర్భాల్లోనూ , మీడియాతో సంభాషించేటప్పుడు గానీ బూతు అనే మాట రానివ్వొద్దని చాలా గట్టిగా చెప్పారు. తమను ప్రజలు అనుక్షణం గమనిస్తున్నారనే సంగతి ప్రజా ప్రతినిధులు గుర్తు పెట్టుకోవాలన్నారు. చిన్న తప్పుడు మాటను కూడా ప్రజలు శాశ్వతంగా గుర్తు పెట్టుకుంటారని హుందాగా ఉండడం అలవాటు చేసుకోవాలని స్పష్టం చేశారు.
వైసీపీ ప్రభుత్వం ఎన్నికల్లో తీవ్రంగా దెబ్బ తినడానికి మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడిన బూతులు ప్రధాన కారణమని చంద్రబాబు స్పష్టం చేశారు. చట్టసభల్లో సైతం వారు యథేచ్చగా బూతులు మాట్లాడే వారనీ.. అలాంటి ప్రవర్తన తన నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆయన చెప్పారు. గత ప్రభుత్వంలో కొందరు మంత్రులు, ఎమ్మెల్యే లు వాడిన ప్రతి బూతు, తిట్టు ఆ పార్టీకే శాపంలా తయారయ్యాయని, ప్రజలు ఆ ప్రవర్తనను అసహ్యించుకున్నారని అందుకే ఎన్నికల్లో ఆ పార్టీ అంతలా ఓడిపోయిందని చంద్రబాబు ఎమ్మెల్యే లకు తెలిపారు. అందుకే కూటమి ఎమ్మెల్యేలు తమ భాష, ప్రవర్తన హుందాగా ఉండేలా ఉండేలా చూసుకోవాలన్నారు.