హైకోర్టులో బెయిల్ పిటిషన్ సోమవారానికి వాయిదా పడినా లోకల్ కోర్టులో మాత్రం టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబుకు శుక్రవారం రాత్రి బెయిల్ మంజూరు అయింది. గురువారం అర్థరాత్రి అయనను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉద్యోగంలో ఉన్న సమయంలో ఆయన నకిలీ బీకాం సర్టిఫికెట్ పెట్టి ప్రమోషన్లు పొందారని లోకాయుక్త ఆదేశంతో సీఐడీ కేసు నమోదయింది. అయితే ఆయనను అదుపులోకి తీసుకున్నారు అరెస్ట్ చూపించారు కానీ కోర్టులో ప్రవేశపెట్టలేదు. ఇరవై నాలుగు గంటల్లో కోర్టులో ప్రవేశ పెట్టాల్సి ఉండటంతో ఉదయం అంతా సీఐడీ అఫీసులోనే ఉంచారు. దీంతో టీడీపీ నేతలు మధ్యాహ్నమే లంచ్ మోషన్ పిటిషన్ వేసి బెయిల్ అడిగారు.
అయితే బెయిల్ ఇవ్వొద్దని ప్రాథమిక ఆధారాలు సమర్పించడానికి గడువు కావాలని సీఐడీ తరపు లాయర్లు హైకోర్టును కోరారు. దీంతో సోమవారానికి వాయిదా వేసిన హైకోర్టు కేసు పెట్టాలని ఆదేశించిన లోకాయుక్తను కూడా పార్టీగా చేర్చి పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. అనూహ్యంగా రాత్రికి ఆయనను ఏసీబీ కోర్టులో ప్రవేశ పెట్టారు. కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. దీంతో ఆయన అప్పుడే విడుదలయ్యారు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉన్నా కిందికోర్టు బెయిల్ ఇవ్వడంతో టీడీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు.
అశోక్ బాబు తాను డిగ్రీ చదివానని ఎలాంటి సర్టిఫికెట్లు పెట్టలేదని… క్లరికల్ మిస్టేక్తో నమోదు చేశారని తనకు ఏ మాత్రం సంబంధం లేదని వాదిస్తున్నారు. గత ప్రభుత్వాల విచారణల్లో అదేతేలింది. క్లీన్ చిట్ కూడా వచ్చింది. డిగ్రీ అర్హతతో ఆయన ఎలాంటి ప్రమోషన్లు పొందలేదని టీడీపీ నేతలు అంటున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం ఆయన ఇతరుల అవకాశాలు కొట్టేశారని సాక్ష్యాలున్నాయి కాబట్టే అరెస్ట్ చేశారని మీడియా ముందుకు వచ్చి చెప్పారు. ఇప్పుడు విషయం హైకోర్టుకు చేరింది. కింది కోర్టులో బెయిల్ ఇచ్చినా తప్పుడు కేసు పెట్టారని హైకోర్టులో అశోక్ బాబు తరపులాయర్లు వాదిస్తే అసలు అధికారం లేకపోయినా కేసు పెట్టాలని ఆదేశించిన లోకాయుక్తకు కూడా ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.