తెలుగుదేశం యువరాజు లోకేశ్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించుకున్నట్టు కథనాలు వచ్చాక ఆయన కోసం త్యాగాలు చేసే వారిమధ్య పోటీ పెరిగిపోతున్నది. అందులోనూ వివాదాలకు మారుపేరైన విజయవాడలో ఎంఎల్ఎలు ఎంఎల్‌సిలు త్యాగాలకు క్యూ కడుతున్నారు. ఎంఎల్‌సి బుడ్డా వెంకన్న, పెనమలూరు ఎంఎల్ఎ బోడె ప్రసాద్‌లు అందరికన్నా ముందు విధేయత చూపించారు. అయితే అసలు ‘చినబాబు’ ప్రత్యక్ష ఎన్నికలపని పెట్టుకోవడం అనవసరమైన రిస్కు అని భావించేవారు తెలుగుదేశంలో ఎక్కువగా వున్నారు. ఒకసారి ఎన్నికల రంగంలోకి దిగాక ఏదైనా జరగొచ్చు గనక ఎంఎల్‌సి మార్గమే బెస్టు అని వీరి సలహా. అయితే ఎన్నికల్లో గెలిచి వస్తే శాశ్వతంగా ఆమోదం పొందినట్టవుతుందనే వారూ కెటిఆర్ ఎంఎల్ఎ గనక మనం తగ్గకూడదనే వారు కూడా టిడిపిలో వున్నారు. అసలే పోటీ రిస్కు అంటుంటే పెనమలూరులో బోడె ప్రసాద్ స్థానంలో పోటీ మరింత రిస్కు అని సన్నిహితులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎలాగో గట్టెక్కించారు గాని లేకపోతే కాల్‌మనీ వ్యవహారంలో ఆ ఎంఎల్ఎ పీకల వరకూ చిక్కుకునేవారని అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలో చినబాబు అక్కడనుంచి పోటీ చేస్తే అనవసరంగా ఆ భాగోతమంతా కదిలించి ప్రతిపక్షాలదాడికి అవకాశం ఇవ్వడమేనని అనుకుంటున్నారు. గతంలోనే ఈ నిందితులలో కొందరి పేర్లు లోకేశ్‌తో ముడిపెట్టి వుండగా ఇప్పుడు అక్కడికే వెళ్లడం కోరి చిక్కులు కొనితెచ్చుకోవడమేనని సలహాదారుల మనోగతం.