పదవుల్ని వదులుకోవడమనేది అంత ఆషామాషీ వ్యవహారం కాదు! పదవులే పరమావధిగా రాజకీయాలు నడుస్తునన ఈ రోజుల్లో.. పదవీ ‘త్యాగం’ అనే మాట వినిపించదు. పార్టీలు ఫిరాయించినా సరే రాజీనామాలు చేయకుండా, పదవుల్ని పట్టుకుని వేలాడే నేతల్ని మనం చూస్తున్నాం. ఇలాంటి తరుణంలో టీడీపీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నారు చక్రపాణి రెడ్డి. నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో ఆయన తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి, వైకాపాలో చేరిన సంగతి తెలిసిందే. బహిరంగ సభలో జగన్ సమక్షంలో ఆయన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు! విలువలతో కూడిన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతోనే చక్రపాణి రాజీనామా చేసినట్టు ప్రకటించారు. ఇదే విధంగా అధికారం పక్షం చేయగలదా..? వైకాపా నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించగలదా అంటూ టీడీపీకి జగన్ సవాలు విసిరినట్టే అయింది. ఈ సందర్భంలో చక్రపాణి త్యాగం చర్చనీయాంశంగా మారుతోంది. చక్రపాణి రాజీనామా చేయాలని ముందే అనుకున్నారా..? లేదా, చివరి నిమిషం జగన్ అడిగేసరికి తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందా..? ఆరేళ్లపాటు ఉండాల్సిన పదవిని తన సోదరుడి కోసమే వదిలేశారా…? భవిష్యత్తులో జగన్ ఇవ్వబోయే పదవి హామీతోనే సంతృప్తి చెందారా అనే చర్చ జరుగుతోంది.
చక్రపాణి పార్టీలోకి వస్తానని నిర్ణయం తీసుకోగానే… ఎమ్మెల్సీ పదవి కూడా వదులుకుని వస్తేనే మంచిదని పార్టీ నేతలకు జగన్ సూచించారట. అయితే, ఈ విషయాన్ని వైసీపీ నేతల చక్రపాణికి తెలియజేయలేదనీ, ఈలోపుగానే ఆయన హడావుడిగా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారని ఇప్పుడో కథనం ప్రచారంలోకి వచ్చింది. టీడీపీకి రాజీనామా చేసిన తరువాత, అంతే హడావుడిగా జగన్ ను కలుసుకునేందుకు చక్రపాణి వెళ్లారట. జగన్ పెట్టిన రాజీనామా షరతు అప్పటివరకూ ఆయనకి తెలియలేదని అంటున్నారు. ఎమ్మెల్సీ పదవి వదులుకోవాలని అక్కడ జగన్ చెప్పడంతో చక్రపాణి గొంతులో పచ్చి వెలక్కాయ పడిందని చెబుతున్నారు! అప్పటికే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు కాబట్టి, ఇక వెనక్కి తగ్గే పరిస్థితి చక్రపాణికి లేకుండా పోయింది! ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ పదవి వదులుకోవడానికి ఏమాత్రం వెనకాడినా, దాని ప్రభావం నంద్యాల ఉప ఎన్నిక ఫలితంపై ఉంటుందన్నది వాస్తవం. తీవ్ర తర్జనభర్జనల మధ్య ఎమ్మెల్సీ పదవీ త్యాగానికి ఆయన సిద్ధపడ్డట్టు సమాచారం. దీంతో రాజీనామా లేఖను బహిరంగ సభలో జగన్ కు అందజేశారు.
రాజీనామా లేఖను జగన్ ఇస్తున్న సమయంలో చక్రపాణి తీవ్ర భావోద్వేగాలకు గురయ్యారు. ఈ సందర్భంలో ఆయన తడబాటును గమనిస్తే పదవిని మనస్ఫూర్తిగా వదులుకోలేదని చెప్పొచ్చని కొంతమంది విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికల్లో వైకాపా తరఫున శ్రీశైలం ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామన్న హామీ జగన్ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో చక్రపాణి కాస్త ఊరట చెందారనీ చెబుతున్నారు. ఏదేమైనా, పదవి వదులకోవడం అనేది ఆషామాషీ వ్యవహారం కాదు. టీడీపీకి సవాల్ గా నిలిపేందుకు చక్రపాణితో పదవీ త్యాగం చేయించారనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. ఆయన ఏ రకంగా పదవీ త్యాగం చేసినా… అధికార పార్టీ ముందు ఓ సవాలును ఉంచినట్టే అయింది.