తెదేపా, బీజేపీల మధ్య జాతీయ స్థాయిలో మంచి స్నేహసంబంధాలే ఉన్నప్పటికీ రాష్ట్ర స్థాయిలో అంత గొప్పగా లేవు. ఇటీవల హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ విషయంలో ప్రధాని నరేంద్ర మోడి మాట్లాడకపోవడాన్ని తప్పుపట్టగా, వారిపై బీజేపీ నేత సోము వీర్రాజు నిప్పులు చెరిగారు.
బాలకృష్ణ, జయదేవ్ ఇద్దరూ తమ వ్యాఖ్యలు ఉపసంహరించుకొని బేషరతుగా నరేంద్ర మోడీకి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. కేంద్రప్రభుత్వం ఇస్తున్న నిధులతో నిర్వహిస్తున్న అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను తెదేపా ప్రభుత్వం తమ స్వంతవిగా చెప్పుకొంటోందని ఆయన ఆరోపించారు. కేంద్రప్రభుత్వం రాష్ట్రానికి కోట్ల రూపాయల నిధులు మంజూరు చేస్తున్నపటికీ, ఎక్కడా ప్రధాని నరేంద్ర మోడీ ఫోటోలు పెట్టడం లేదని, కనీసం రాష్ట్ర బీజేపీ నేతలను ఆ కార్యక్రమంలో పాలుపంచుకొనేందుకు ఆహ్వానించడం లేదని సోము వీర్రాజు ఆరోపించారు. తెదేపా నేతలు ఇదే వైఖరి కొనసాగిస్తే ప్రభుత్వం నుంచి తప్పుకొని బయటకు వచ్చి పోరాడుతామని తీవ్రంగా హెచ్చరించారు. తెదేపా నేతలు కేంద్రప్రభుత్వంపై, ప్రధాని నరేంద్ర మోడిపై చేస్తున్న విమర్శలు వారి వ్యక్తిగతమయినవా లేక తెదేపా తరపున చేస్తున్నావా? చెప్పమని నిలదీశారు.
ఇంతవరకు తెదేపా కూడా సోము వీర్రాజును చాలా ఉపేక్షిస్తూ వచ్చింది. కానీ ఈసారి ఆయనకు చాలా ధీటుగా జవాబిచ్చింది. తెదేపా ఎమ్మెల్సీ బాబు రాజేంద్ర ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ, “ అసలు సోము వీర్రాజు తన గురించి తను ఏమనుకొంటున్నారో తెలియదు. ఆయన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కంబంపాటి హరిబాబు కంటే గొప్పవాడిని అనుకొంటున్నారా? ఆయన తెదేపా ప్రభుత్వం పట్ల చాలా దురుసుగా మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడుతున్న మాటలు ఆయన స్వంత అభిప్రాయాలా…లేక బీజేపీ అభిప్రాయాలా? చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాము. ఆయనని అదుపులో పెట్టవలసిందిగా బీజేపీ అధిష్టానాన్ని కోరుతాము. ఆయన మాట్లాడుతున్న మాటల వలన తెదేపా, బీజేపీ సంబంధాలు దెబ్బ తింటున్నాయి,” అని అన్నారు.
“కేంద్రప్రభుత్వం కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఇస్తోందని ఆయన అంటున్నారు. కానీ రాష్ట్ర ప్రజలే వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి కనీసం లక్ష కోట్లు సమర్పించుకొంటున్నారు. అందులో 45,000 కోట్లు మాత్రమే రాష్ట్రానికి తిరిగి ఇస్తోంది. మరి అటువంటప్పుడు బీజేపీ నేతల ఫోటోలు పెట్టవలసిన అవసరం ఏమిటి? సోము వీర్రాజు వీలయితే డిల్లీ వెళ్లి కేంద్రాన్ని ఒప్పించి రాష్ట్రానికి ఆర్ధిక ప్యాకేజీ, ప్రత్యేక హోదా సాధించుకొని వచ్చి మాట్లాడితే బాగుంటుంది,” అని బాబు రాజేంద్ర ప్రసాద్ అన్నారు.
ఈ మాటలు ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో మీడియా పాయింట్ వద్ద అన్నారు కనుక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి తెలిసే అన్నట్లుగా, వాటిని తెదేపా అభిప్రాయాలుగానే పరిగణించవచ్చును.