రాజకీయాల్లో విచిత్రాలు అంటే.. ఇలాగే ఉంటాయి. మూడు రాజధానుల నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. తెలుగుదేశం పార్టీ అమరావతి కోసం నిలబడింది. ఎవరైనా.. అమరావతికి మద్దతుగా ఉండాలి అనుకుంటే… వైసీపీ ప్రజాప్రతినిధులు రాజీనామా చేయాలి. అనూహ్యంగా.. అమరావతికి మద్దతుగా టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ తన ఎమ్మెల్సీ స్థానానికి రాజీనామా చేశారు. పార్టీకి రాజీనామా చేసినట్లుగా ఆయన చెప్పలేదు కానీ.. ఎమ్మెల్సీ పదవికి మాత్రం రాజీనామా లేఖ పంపారు. అమరావతి ముక్కలు కావడాన్ని మూడు రాజధానులు ఏర్పాటు చేయడాన్ని తాను భరించలేకపోతున్నానని.. ఆయన లేఖలో చెప్పుకొచ్చారు. ప్రోత్సహించిన చంద్రబాబు, లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్య.తిరేకించాలనుకుంటే.. డొక్కా మాణిక్యవరప్రసాద్.. మండలికి వచ్చి.. ఆ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలి. కానీ.. టీడీపీ ఎమ్మెల్సీలకు మెజార్టీ ఉందని.. తెలిసి.. ఆ బిల్లు పాస్ కాదని తెలిసి.. తన ఎమ్మెల్సీ ఓటు కూడా కీలకమేనని తెలిసి కూడా.. డొక్కా మాణిక్యవరప్రసాద్.. మండలికి హాజరు కాకుండా.. రాజీనామా లేఖను పంపడం.. అధికార పార్టీ వ్యూహమని టీడీపీ అంచనా వేస్తోంది. అమరావతికి మద్దతుగా పోరాడుతున్న టీడీపీ నుంచి.. వైసీపీ విధానానికి వ్యతిరేకంగా రాజీనామా చేయడం.. విచిత్రమైన టీడీపీ నేతలు అంటున్నారు.
డొక్కా మాణిక్యవరప్రసాద్.. ఒకప్పుడు.. వైఎస్‌కు సన్నిహితుడు. తర్వాత ఆయన.. వైసీపీలో చేరాలని అనుకున్నారు. కానీ రాయపాటికి సన్నిహితుడు కావడంతో.. ఆయన టీడీపీలోకి తీసుకు వచ్చారు. టీడీపీలో ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇచ్చింది. అలాగే.. గత ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేసే అవకాశం కూడా కల్పించింది. కానీ పరాజయం పాలయ్యారు. ఆయన ఇప్పుడు.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి.. వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరుగుతోంది. అయితే.. మూడు రాజధానులను ఏర్పాటు చేస్తున్న వైసీపీలోకి.. అలా ఏర్పాటు చేస్తున్నందుకు… పదవికి రాజీనామా చేసిన డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎలా వెళ్తారని.. టీడీపీ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి.