నెల్లూరు జిల్లాలో నిన్న జరిగిన మినీ మహానాడులో ఆ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకు పడ్డారు. నిధులు, ప్రాజెక్టులు, వివిధ హామీల అమలు చేయకుండా భాజపా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోసం చేస్తోందని విమర్శించారు. సోమిరెడ్డి చేసిన విమర్శలకు మళ్ళీ రాష్ట్ర భాజపా నేతలు కూడా ఘాటుగానే జవాబు చెప్పడం ఖాయం.
విభజన హామీల అమలు విషయంలో తెదేపా, భాజపాల నేతలకు పూర్తి స్పష్టత ఉన్నప్పటికీ, ఆ రెండు పార్టీల నేతలు వాటి గురించి వాదోపవాదాలు చేసుకొంటూ ఒకరినొకరు విమర్శించుకొంటూనే, మళ్ళీ యధాప్రకారం తమ స్నేహాన్ని కొనసాగిస్తుండటంతో వారు ప్రజలను మభ్యపెట్టడానికే ఆవిధంగా ఒకరినొకరు విమర్శించుకొంటున్నారా? లేకపోతే వచ్చే ఎన్నికలలో కలిసి పని చేస్తామో లేదో తెలియని అయోమయ స్థితిలో ఉన్నందున ఇప్పటి నుంచే రెండు పార్టీలు దేని జాగ్రత్తలో అవి ఉంటూ తప్పుని ఎదుట పార్టీ పైకి త్రోసి తమ బాధ్యతల నుంచి తప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయా? అనే అనుమానం కలుగుతోంది. ప్రస్తుత పరిస్థితులలో అవి తెగతెంపులు చేసుకొంటే రెంటికీ నష్టం కనుక వచ్చే ఎన్నికల వరకు లేదా వీలైనంత కాలం కలిసి సాగక తప్పదని గ్రహించినందునే రెండూ కూడా ఈ విధంగా ప్రజలను మభ్యపెడుతూ కాలక్షేపం చేస్తున్నాయని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఆ రెండు పార్టీలు కూడా ఆవిధంగా వ్యవహరించడం చాలా పెద్ద పొరపాటని చెప్పవచ్చు. అవి నింద తమపై పడకుండా తప్పించుకోవాలనే ప్రయత్నంలో ఒకదానినొకటి ప్రజల దృష్టిలో దోషిగా నిలబెట్టుకొంటునందున, చివరికి రెండూ కూడా ప్రజల ముందు దోషులుగా నిలబడుతున్నాయి. దాని వలన చివరికి అవే నష్టపోయే అవకాశం ఉంది. ఆ రెండు పార్టీల వైఫల్యాలని అవే లెక్కలతో సహా వర్ణించి మరీ చెప్పుకొంటున్నాయి కనుక అది వైకాపాకి అనుకూలంగా మారవచ్చు. మరి ఈ అవకాశాన్ని వైకాపా సద్వినియోగం చేసుకోగలదో లేదో చూడాలి.