న్యాయం మీరే చెప్పాలంటూ… టీడీపీ ఎమ్మెల్సీలు ఢిల్లీ పెద్దల వద్దకు వెళ్తున్నారు. శాసనమండలి రద్దు చేయడానికి కేంద్రప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్కు భరోసా ఇచ్చిందన్న ప్రచారంతో… టీడీపీ ఎమ్మెల్సీలు అలర్ట్ అయ్యారు. మార్చి మూడో తేదీ నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అప్పుడే బిల్లు పెట్టి ఆమోదిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అంత కంటే.. ముందే.. తమ వాదన కేంద్రానికి వినిపించాలని.. టీడీపీ ఎమ్మెల్సీలు సిద్ధమయ్యారు. మొత్తం 10 మంది ఎమ్మెల్సీలు ఢిల్లీ వెళ్లనున్నారు. శాసనమండలి రద్దుకు రాజకీయ కారణాలను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రులకు వనతి పత్రాలు ఇవ్వనున్నారు.
దీనికి సంబంధించి వినతిపత్రాలను కూడా సిద్ధం చేసుకున్నారు. ఇందులో ప్రభుత్వానికి మండలి ఏ విధంగానూ వ్యతిరేకంగా లేదన్న విషయాన్ని చెప్పనున్నారు. వైసీపీ అధికారంలోకొచ్చిన తర్వాత శాసనసభ నుంచి మండలికి 42 బిల్లులు వచ్చాయని, ఇందులో 38 బిల్లులను యథాతధంగా ఆమోదించామని, రెండు బిల్లులకు సవరణలు ప్రతిపాదించి, మరో రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపామని ఎమ్మెల్సీలు కేంద్రానికి చెప్పబోతున్నారు. పరిపాలన వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపటంతో వైసీపీ ప్రభుత్వం కక్షతో వ్యవహారిస్తుందని టీడీపీ ఎమ్మెల్సీలు వాదిస్తున్నారు.
టీడీపీ ఎమ్మెల్సీలకు మంగళవారం సాయంత్రం ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో అపాయింట్ మెంట్ ఖరారైంది. మిగతా వారి అపాయింట్మెంట్లు తీసుకునేందుకు టీడీపీ ఎంపీలు ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రపతి, ప్రధాని, హోంమంత్రుల అపాయింట్మెంట్లు దక్కితే మాత్రం.. ఎమ్మెల్సీలకు కాస్త ధైర్యం వచ్చే అవకాశం ఉంది.