భారతీయజనతా పార్టీతో పాటించవలసిన దూరాన్ని సరిగ్గా బేరీజు వేయలేకపోతే జాతీయ రాజకీయాల నుంచి తెలుగుదేశం దూరమయ్యే పరిస్ధితి దగ్గరపడుతోంది.
దేశవ్యాప్తంగా వున్న ప్రాంతీయ పార్టీలను కూడగట్టి నేషనల్ ఫ్రంట్ ను ఏర్పరచి కాంగ్రెస్ కు సవాలు విసిరిన ఘనత తెలుగుదేశం వ్యవస్ధాపకుడైన నందమూరి తారక రామారావుది కాగా, ఫ్రంట్ ఆధ్వర్యంలో జాతీయరాజకీయాలను నడిపించి ఒకసారి ప్రధానమంత్రినే ఎంపిక చేసిన చతురత, మరొకసారి కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి ప్రభుత్వాన్ని నిర్దేశించిన చరిత్ర తెలుగుదేశం అధ్యక్షుడైన ముఖ్యమంత్రి చంద్రబాబుదే.
కేంద్రప్రభుత్వంలో చేరకుండా అంశాలవారీ మద్ధతు ఇచ్చే మధ్యవర్తి, లేదా పెద్దమనిషి పాత్రను నిర్వహించడమే ఆయా సందర్భాల్లో తెలుగుదేశం ఆధిక్యత, ప్రతిష్ట పెరగడానికి మూలం.
అధికారానికి పదేళ్ళు దూరంగా వున్న పూర్వరంగంలో, రాష్ట్రవిభజన నేపధ్యంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభావం తనకు ప్రతికూలంగా వున్న పరిస్ధితుల్లో గెలుపుకోసం ఎడాపెడా హామీలు ఇచ్చేసి తెలుగుదేశాన్ని అధికారం ఎక్కించిన చంద్రబాబు ఆర్ధిక సమస్యలనుంచిబ యటపడలేక సతమతమౌతున్నారు. ఎన్నికల పొత్తుద్వారా చేతులుకలిపిన బిజెపి మిత్రధర్మాన్ని పక్కన పెట్టేసింది. అన్నీ చేస్తామనే మాటలతో ఏమీ చేయకుండానే కాలాన్ని వెళ్ళబుచ్చుతోంది. తెలుగుదేశం అధికారంలో వుండగా ఆంధ్రప్రదేశ్ కు ఢిల్లీ ఏమీ చేయదు అనే సంకేతం సామాన్య ప్రజలకు కూడా అర్ధమయ్యేలా బిజెపి నాయకులు వ్యవహరిస్తున్నారు.
ఇదంతా చంద్రబాబుకి అర్ధంకాలేదు అనుకోలేము. రైతుల రుణమాఫీ మొదలు రాజధాని నిర్మాణం వరకూ మొయ్యలేనన్ని హామీలను నెత్తికెత్తుకుని ఆయన అతిభారంగా నడుస్తున్నారు. సరళీకృత ఆర్ధిక విధానాలు, ప్రయివేటీకరణా అభివృద్ధి చెందుతున్న ప్రతీ దేశంలోనూ వున్నవే. చంద్రబాబు, నరేంద్రమోదీ వంటివారు ఈ ఆర్ధిక విధానాల మీద వ్యక్తిగతంగా కూడా మోజు పెంచుకుని పనిచేస్తున్నట్టు కనిపిస్తారు. ఈ ఉత్సాహంతో వారు నిర్ణయించకున్న ప్రాధాన్యతలు జనబాహుళ్యానికి రుచించడంలేదు. పైగా వ్యతిరేక ఫలితాలు కూడా మొదలయ్యాయి.
నా జీవనభారం తగ్గనపుడు ప్రపంచస్ధాయి రాజధాని వస్తే నాకేమి ఉపయోగం అని చంద్రబాబునీ, ఈయన మాటలు సమ్మోహనంగా వుంటాయి కానీ, రెండేళ్ళవుతున్నా ఏ ఫలితమూ అనుభవానికి రావడం లేదని నరేంద్రమోదీనీ విమర్శించకోవడం ప్రజల్లో మొదలైంది. వీరిద్దరిలో పదవిరీత్యా మోదీకి వున్న అడ్వాంటేజి బాబుకి లేదు.
ఆ అడ్వాంటేజితోనే ఉద్దేశ్య పూర్వకంగా బిజెపి ప్రభుత్వం రాష్ట్రం పట్ల అవలంబిస్తున్న వైఖరి ప్రజలను అవమానించడంగానే వుంది. జగన్ ముందు చంద్రబాబు అనుభవాన్ని చూసీ, మోదీ వంటి ప్రత్యామ్నాయ నాయకుడిని చూసీ తెలుగుదేశం, బిజెపి కాంబినేషన్ ని ప్రజలు గెలిపించారు. ప్రజల ఆశలు నెరవేరనపుడు, విభజన చట్టంలో అంశాలను కూడా అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నపుడు తెలుగుదేశాన్నీ, బిజెపినీ సహించే పరిస్ధితి ప్రజలకు వుండదు.
ఆంధ్రప్రదేశ్ లో గెలవగలిగినంత బలం లేని బిజెపికి తెలుగుదేశం మీద ఆసక్తిలేదు. ఆశలుపెట్టి నడుం విరగ్గొడుతున్న బిజెపి మీద తెలుగుదేశానికి గౌరవంలేదు. విడాకుల నోటీసు రానీ అల్లరి పెట్టేస్తాను అన్నట్టు ఈ రెండు పార్టీలూ బ్లేమ్ గేమ్ కి సిద్ధమౌతున్నాయనిపిస్తోంది. రెండుపార్టీలూ ప్రజలను మనుషులుగా కాక ఓట్లుగా మాత్రమే చూస్తున్న దౌర్భాగ్యమే ఈ స్ధితికి మూలం!
రాజధానిలేకపోయినా, పోలవరం ప్రాజెక్టు కట్టకపోయినా ప్రజాజీవితం స్తంభించిపోలేదు. మెరుగైన జీవన ప్రమాణాలు సాధిస్తూ హామీలు ఎందుకు నెరవేర్చుకోలేకపోతున్నామో వివరిస్తూ తెలుగుదేశం ముందుకి వస్తే ప్రజలు నెత్తిన పెట్టుకుని మోస్తారు.
అందుకు ముందుగా బిజెపితో మైత్రీబంధాన్ని వొదిలించుకుని, మంచికి ప్రశంశ, చెడుకి విమర్శ చేస్తూ బిజెపి పట్ల తటస్ధతను ప్రజలముందు ప్రదర్శిస్తే తెలుగుదేశం ప్రతిష్ట ఇనుముడిస్తుంది. చంద్రబాబు హీరో అయ్యే అవకాశం వుంది. ఆయన బిజెపి మిత్రపక్షంగా వుండటం వల్ల ” ఆ అవకాశాన్ని ఇప్పటికే బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ చేజిక్కించుకున్నారు.