ఎంపీ సీఎం రమేష్, ఎమ్మెల్సీ బీటెక్ రవి ఉక్కుదీక్షలు ఏడో రోజుకు చేరాయి. వారి శరీరంలో షుగర్ లెవల్స్ ప్రమాదకరంగా పడిపోయాయని.. కడప రిమ్స్ వైద్యులు తేల్చారు. ఉన్నపళంగా దీక్ష విరమించాలని కోరారు. లేకపోతే.. ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు. కానీ వారిద్దరూ… వెనక్కి తగ్గడం లేదు. తెలుగుదేశం పార్టీ కూడా వీరికి మద్దతుగా జాతీయ స్థాయి పోరాటానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ” కడప ఉక్కు – ఆంధ్రుల హక్కు” అనే నినాదం దేశం మొత్తం ప్రతిధ్వనించేలా మూడు రోజుల పాటు భారీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ రోజు ఏపీ వ్యాప్తంగా మోటార్ సైకిళ్ల ర్యాలీ, రేపు అన్ని జిల్లాల్లో ధర్నాలు, ఇరవై ఎనిమిది ఎంపీలందరూ.. ఢిల్లీలో ధర్నా చేయాలని నిర్ణయించారు.
సీఎం రమేష్ , బీటెక్ రవి చేస్తున్న దీక్షలకు తెలుగుదేశం జాతీయ స్థాయి మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తోంది. 28వ తేదీన ఎంపీలు ఢిల్లీలో చేయనున్న ధర్నాకు.. ప్రాంతీయ పార్టీలకు చెందిన ముఖ్యనేతలందరూ సంఘిభావం ప్రకటించే అవకాశం ఉంది. ఇదే సమయంలో వైసీపీని కార్నర్ చేసేలా.. చంద్రబాబు పోరాట ప్రణాళికను సిద్ధం చేశారు. వైసీపీ అధినేత సొంత జిల్లాలోనే ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమం చేయకుండా కేసుల మాఫీ చేసుకునేందుకు సైలెంట్ అయిపోయారని తీవ్రంగా విమర్శలు గుప్పిస్తున్నారు. దాన్నే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. తామే దీక్షలకు దిగిన విషయాన్ని. కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడుతున్న అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకువెళ్లేందుకు చంద్రబాబు వ్యూహం రూపొందించారు.
గవర్నర్ నరసింహన్ … సోమవారం ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఫోన్ చేశారు. సీఎం రమేష్, బీటెక్ రవిల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వారిద్దరి ఆరోగ్య పరిస్థితులపై జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇదే అంశాన్ని కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు గవర్నర్కు సూచించారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకపోతే ఎలా అని ప్రశ్నించారు. ఈ విషయంలో గవర్నర్ ఇంతకు మించి ఏమీ చేయలేకపోవచ్చు. ఇప్పుడు దీక్షలను భగ్నం చేయడానికి పెద్దగా స్కోప్ లేదు. ఎందుకంటే.. చేస్తున్నది అధికార పార్టీ ఎంపీనే. కేంద్రం నుంచి ప్రకటన వచ్చే వరకూ.. ఈ వేడిని పెంచుకుంటూ.. ఒత్తిడి పెంచే అవకాశం కనిపిస్తోంది.