కడప ఉక్కు కర్మాగారం సాధించే వరకూ తగ్గేది లేదంటూ సీఎం రమేష్ దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే. కేంద్రమంత్రి ఫోన్ చేసినా.. స్పష్టమైన ప్రకటన వస్తే తప్ప విరమించనని తెగేసి చెప్పారు. ఇంకోపక్క, ఢిల్లీ వెళ్లిన ఏపీ ఎంపీలు కూడా ఉక్కు పరిశ్రమ సాధన దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు రాసిన లేఖను కేంద్రానికి అందించారు. అంతవరకూ బాగానే ఉంది కానీ, ఢిల్లీ వెళ్లిన ఎంపీల చిత్తశుద్ధినే శంకించాల్సిన పరిస్థితిని వారే కొని తెచ్చుకున్నారు..! ఇప్పటికే, ఉక్కూ లేదూ తుక్కూ లేదూ అంటూ సీఎం రమేష్ దీక్షపై జేసీ దివాకర్ రెడ్డి నోరు జారి విమర్శలపాలయ్యారు. ఆ తరువాత, తూచ్ అంటూ మాట మార్చి, ఇవాళ్ల ఢిల్లీలో తమది ఉక్కు సంకల్పం అంటున్నారు! అయితే, వీరి చిత్తశుద్ధి అంతా మీడియా మైకుల ముందు మాత్రమేనా అని అనుమానం కలిగే రీతిలో ఎంపీలు జోకులేసుకుంటూ మాట్లాడిన ఒక వీడియో ఇప్పుడు తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
టీడీపీ ఎంపీ మురళీ మోహన్ మాట్లాడుతూ… ‘ఏమండీ… నేనొక ఐదు కేజీలు తగ్గాలనుకుంటున్నాను. ఓ వారం రోజుల వరకూ అయితే నేను చేస్తాను’ అన్నారు. ఆయన ఇలా కామెంట్ చేసింది అచ్చంగా నిరాహార దీక్ష గురించే..! ఈయన ఇలా అంటుంటే.. మరోపక్క నుంచి అవంతి శ్రీనివాస్ జోనూ లేదూ, గీనూ లేదూ అంటూ నవ్వుతున్నారు. ఈ చర్చలో జేసీ దివాకర్ రెడ్డి, గల్లా జయదేవ్, మాగంటి బాబు, రేణుక ఉన్నారు. ఓపక్క రాష్ట్రంలో ఎంపీ నిరాహార దీక్ష చేస్తుంటే… మురళీ మోహన్ చేస్తున్న కామెడీ కామెంట్ ఇలా ఉంది మరి..? బరువు తగ్గడం కోసం దీక్ష చేస్తారట. అంటే, దీక్షలను ఆయన ఎలా చూస్తున్నారనేది బయటపెట్టుకున్నారు.
ఈ మధ్యనే రాజమండ్రిలో ఓ మీటింగులో తిరుమల వేంకటేశ్వరుని ఉద్దేశించి మాట్లాడుతూ… వెంకన్న చౌదరి అని మురళీ మోహన్ అన్నారు. దీంతో ఒక్కసారి విమర్శలు గుప్పుమన్నాయి. దాంతో నాలిక కరుచుకుని క్షమాపణలు చెప్పారు. ఏదో ఫ్లో లో నోరు జారి అలా అన్నానుగానీ, వెంకటేశ్వర స్వామికి కులం ఆపాదించడం తన ఉద్దేశం కాదంటూ వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఆ సాకు చెప్పి విమర్శల నుంచి తప్పించుకున్నారు. కానీ, ఇప్పుడు ఉక్కు దీక్షపై మాట్లాడుతూ.. ఐదు కేజీల బరువు తగ్గాలని తనకి ఉందనీ, ఓ వారం చేస్తానంటూ మాట్లాడారు.
మరి, దీనిపై కూడా నోరు జారాననే మురళీ మోహన్ అంటారేమో..? అంటే మాత్రం సరిపోతుందా..? రాష్ట్ర ప్రయోజనాల విషయమై కేంద్రంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోరాటం చేస్తుంటే… దానిపై కనీస బాధ్యత, చిత్తశుద్ధి లేకుండా ఎంపీలు వ్యవహరిస్తున్నారనే విమర్శలకు మురళీ మోహన్ చెక్ పెట్టగలరా..? టీడీపీ ఎంపీల చిత్తశుద్ధి ఇదే అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తి పోస్తే, ఈయన వివరణ ఇవ్వగలరా..? నా ఉద్దేశం అది కాదు అంటూ కవర్ చేసుకున్నా… అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. మొత్తానికి, మురళీ మోహన్ తాజా నోరుజారుడు ఈసారి టీడీపీకి బాగా తలనొప్పి కలిగించే అంశం కావడం తప్పదనే అనిపిస్తోంది.