ప్రధాని నరేంద్ర మోడీ అమరావతి శంఖుస్థాపన కార్యక్రమానికి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ ప్రకటించకపోవడంపై అప్పుడే సర్వత్రా నిరసనలు మొదలయ్యాయి. రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు అప్పుడే నిరసనలు, దిష్టి బొమ్మల దగ్ధం వంటి కార్యక్రమాలు రూపొందించుకొని రోడ్ల మీదకు వస్తుంటే, అధికార తెదేపా నేతలు వాటికి సమాధానం చెప్పుకోలేక తడబడుతోంది.
సాధారణంగా ఇటువంటి పరిస్థితి తలెత్తినప్పుడల్లా దానిని నుండి బయటపడేందుకు తెదేపా నేతలు ఒక అద్భుతమయిన వ్యూహం అమలుచేస్తుంటారు. వారు కూడా ప్రతిపక్షాలతో గొంతు కలిపి కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రజాగ్రహానికి గురికాకుండా జాగ్రత్తపడుతుంటారు. ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా సీరియస్ గా ఉన్నారని, దీని గురించి తన మంత్రులతో చర్చించడానికి అత్యవసర సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెదేపా నేతలు మీడియాకి లీకులు ఇస్తుంటారు. అప్పుడు కేంద్రం ఏదో చిన్న తాయిలం ప్రకటిస్తుంది. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులను, నేతలను మోడీకి, మిత్రపక్షమయిన బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడవద్దని హెచ్చరించినట్లు మీడియాలో వార్తలు వస్తాయి. అంతా చల్లబడిందని నిర్ధారించుకొన్న తరువాత మళ్ళీ తెదేపా మంత్రులు, నేతలు మోడీ ప్రభుత్వాన్ని వెనకేసుకొని వస్తూ షరా మామూలుగా ప్రతిపక్షాలపై విరుచుకుపడుతుంటారు. గత 15 నెలల్లో ఈ వ్యూహాన్ని చాలా విజయవంతంగా అమలుచేసారు. మళ్ళీ ఇప్పుడు దానిని మరోసారి అమలుచేయవలసిన సమయం వచ్చినట్లుంది.
ఈసారి ఆ వ్యూహాన్ని అమలుచేసే పని తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ ప్రారంభించినట్లున్నారు. ఆయన నిన్న గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ, “ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగం నాకు చాలా నిరాశ కలిగించింది. ఆయన ఈ చారిత్రిక సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక హోదాపై ఒక నిర్దిష్టమయిన ప్రకటన చేస్తారని ఆశగా ఎదురు చూసారు. కనీసం ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీనయినా ప్రకటిస్తారనుకొన్నారు. కానీ ఆయన ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో ప్రజలందరూ తీవ్ర నిరాశ చెందారు. బీజేపీతో కలిసి పనిచేస్తున్నంత కాలం మేము కేంద్రంతో దీని కోసం పోరాడి సాధించుకోలేమని భావిస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ అంశం గురించి మాట్లాడి అవసరమయితే మళ్ళీ మరొక్కసారి ప్రధాని నరేంద్ర మోడీని కలిసి ప్రత్యేక హోదా కోసం గట్టిగా డిమాండ్ చేస్తాము,” అని అన్నారు. ముందు చెప్పుకొన్నట్లుగానే దీని గురించి చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మంత్రులతో సమావేశం కాబోతున్నారని మీడియాలో వార్తలు వస్తున్నాయి. కనుక ఆ తరువాత మిగిలిన తంతు అంతా యధాప్రకారం జరిపిస్తారేమో.