తెదేపా రాజ్యసభ సభ్యురాలు గుండు సుధారాణి శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో తెరాస కండువా కప్పుకొన్నారు. ఇటువంటి సందర్భంలో సాధారణంగా తెరాసలో చేరేవారందరూ పలికే చిలుక పలుకులే ఆమె కూడా ముచ్చటగా పలికేరు. తెలంగాణా రాష్ట్రాభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కృషిని చూసి ముగ్దురాలయి, రాష్ట్రాభివృద్ధిలో తాను కూడా పాలుపంచుకోవాలనే ఉద్దేశ్యంతోనే తెరాసలో చేరుతున్నట్లు ఆమె చెప్పారు. త్వరలో ఆమె రాజ్యసభ పదవీ కాలం పూర్తవుతున్నందున మళ్ళీ తనకి మరో అవకాశం రాదని గ్రహించినందునే ఆమె కేసీఆర్ ఆహ్వానించగానే తెరాసలోకి దూకేశారని తెదేపా నేతలు అంటున్నారు. కారణాలు ఏవయినప్పటికీ ఆమె తెరాస తీర్ధం పుచ్చేసుకొన్నారు కనుక ఇక గతం గురించి మాట్లాడుకోవడం కంటే భవిష్యత్ గురించి మాట్లాడుకోవడమే సబబుగా ఉంటుంది.
ఆమెకు వరంగల్ జిల్లాపై పట్టులేకపోయినప్పటికీ తెదేపా ఆమెకు రాజ్యసభ సీటు ఇచ్చి గౌరవించింది. కానీ తెరాసలో అటువంటి గౌరవం, అవకాశం ఆమెకు దక్కుతాయా…అంటే అనుమానమే. ఎందుకంటే తెరాసలో ఒక్క కవితకి తప్ప మరే మహిళలకు పెద్దగా ప్రాధాన్యత లేదు. ఇదివరకు విజయశాంతి అంత పాపులర్ వ్యక్తి తెరాసలో చేరి తన ఉనికిని కోల్పోయింది. చాలా అవమానకర పరిస్థితుల్లో ఆమె బయటకు వెళ్ళవలసి వచ్చింది. కనుక ఇవ్వాళ్ళ తెరాస కండువా కప్పుకొన్న సుధారాణి కూడా తెరాసలో ప్రేక్షకపాత్రలో ఒదిగిపోగలిగితే ఎటువంటి ఇబ్బంది లేకుండా హాయిగా కాలక్షేపం చేసేయవచ్చును. అలాకాక తనకూ తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆశిస్తే నిరాశ తప్పదు.
వరంగల్ ఉప ఎన్నికల ముందు తెదేపాను మానసికంగా దెబ్బ తీసి ఎంతో కొంత బలహీనపరుద్దామనే ఉద్దేశ్యంతోనే కేసీఆర్ ఆమెను తెరాసలోకి ఆహ్వానించి ఉండవచ్చును. కానీ వరంగల్ నుండి తెదేపా పోటీ చేయడం లేదిప్పుడు. ఆ స్థానాన్ని బీజేపీకి వదిలిపెట్టింది. కనుక సుధారాణి పార్టీని వీడి వెళ్లిపోవడం వలన తెదేపాకు వచ్చే నష్టం ఏమీ లేదు. కనుక ఆమె రాక వలన తెరాసకు అదనంగా వచ్చే లాభం కూడా ఏమీ ఉండబోదు. ఈ సంగతి ఆమె గ్రహించి తెరాసలో సర్దుకుపోయే ప్రయత్నం చేయడం మంచిది లేకుంటే ఇబ్బందులు మళ్ళీ కండువా మార్చుకోవలసిన అవసరం ఏర్పడవచ్చును.